తమ దేశంలో ముఠాలతో జరుగుతోన్న ఘర్షణలు కారణంగా భారత్‌లోకి మయన్మార్ సైనికులు ప్రవేశించినట్టు కేంద్రాన్ని మిజోరాం ప్రభుత్వం అప్రమత్తం చేసిన వేళ హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ బోర్డర్ మాదిరిగానే మాయన్మార్ సరిహద్దుల్లోనూ ఇనుప కంచెను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. బంగ్లా నుంచి వలసలను ఆపినట్లే మయన్మార్ నుంచి వచ్చే వారికి అడ్డుకట్ట వేయాలని కేంద్రం నిర్ణయించిందని చెప్పారు. అసోం రాజధాని గువహటిలో జరిగిన పోలీసు కమాండోల పాసింగ్ అవుట్ పరేడ్‌లో కేంద్ర హోం మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్ - మయన్మార్ మధ్య కంచె వేస్తామని వెల్లడించారు. బంగ్లాదేశ్‌తో ఉన్న సరిహద్దు మాదిరిగానే మయన్మార్‌కి సైతం కంచె వేయాలని ప్రధాని మోదీ నిర్ణయించారని షా పేర్కొన్నారు. దీని వల్ల ఇరు దేశాల సరిహద్దుకు దగ్గరగా నివసించే వ్యక్తులు.. వీసా లేకుండా మరొకరి భూభాగంలోకి ప్రవేశించడానికి అనుమతించే ఫ్రీ మూవ్‌మెంట్ రీజిమ్ (FMR) త్వరలో ముగియనుంది. భారత్-మాయన్మార్ సరిహద్దుల్లో అధునాతన స్మార్ట్ ఫెన్సింగ్ వ్యవస్థ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం టెండర్ ప్రక్రియ ప్రారంభించింది.
భారత్‌లోని మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు మయన్మార్‌తో 1,643 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును పంచుకుంటున్నాయి. ఈ రాష్ట్రాలన్నీ ప్రస్తుతం FMRని కలిగి ఉన్నాయి. ఇరు దేశాల మధ్య శతాబ్దాలుగా ఉన్న సంబంధాల నేపథ్యంలో 1970వ దశకం నుంచి భారత్ యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా అమలు చేశారు. కాగా, మయన్మార్‌లో సైనిక పాలన కొనసాగుతుండగా.. గత కొంతకాలంగా వారికి ఊహించని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ప్రజాస్వామ్య అనుకూలవాదులతో కూడిన సాయుధులు బృందాలుగా ఏర్పడి సైనికులపై దాడులు చేస్తూ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు 600 మంది మయన్మార్ సైనికులు సరిహద్దులు దాటి భారత్‌లోకి ప్రవేశించినట్లు సమాచారం. రెబల్ గ్రూప్ అరాకన్ ఆర్మీ తమ శిబిరాలను స్వాధీనం చేసుకోవడంతో వారంతా మిజోరంలోని లాంగ్‌ట్లాయ్ జిల్లాలో ఆశ్రయం పొందుతున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అస్సాం రైఫిల్స్ క్యాంపుల్లో మయన్మార్ సైన్యం ఉంటున్నట్లు సమాచారం.