ప్రస్తుతం అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఇప్పుడు దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం గురించే చర్చ జరుగుతోంది. హిందువులకు 500 ఏళ్ల నాటి కల నెరవేరుతుండటంతో హాట్ టాపిక్‌గా మారింది. అయోధ్యలో దివ్య రామ మందిరం నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి ముస్తాబు అయింది. అయితే ఈ ప్రపంచంలోనే ఎత్తైన రామ మందిరం నిర్మించేది మాత్రం ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో కావడం విశేషం. సుమారు రూ.600 కోట్ల వ్యయంతో 721 అడుగుల ఎత్తులో ఈ రామాలయాన్ని నిర్మిస్తున్నారు.
150 ఎకరాల విస్తీర్ణంలో ద ఇంటర్నేషనల్ శ్రీరాం వేదిక్ అండ్ కల్చరల్ యూనియన్ (ఐఎస్‌వీఏసీయూ-ఇస్వా) ఆధ్వర్యంలో పెర్త్‌లో ఈ వరల్డ్ టాలెస్ట్ రామ మందిరం రూపుదిద్దుకోనుంది. ఈ సందర్భంగా ఆలయ ప్రాజెక్టు గురించి శ్రీరామ్ వేదిక్ కల్చరల్ ట్రస్ట్ డిప్యూటీ హెడ్ డాక్టర్ హరేంద్ర రాణా వివరాలు వెల్లడించారు. భారీ ఎత్తున రామ మందిరాన్ని నిర్మిస్తామని.. ఆలయ కాంప్లెక్స్ ప్రాంగణాన్ని ఆకర్షణీయమైన కట్టడాలతో తీర్చిదిద్దుతామని తెలిపారు.
ద ఇంటర్నేషనల్ శ్రీరాం వేదిక్ అండ్ కల్చరల్ యూనియన్ సంస్థ ఆధ్వర్యంలో ఈ ఎత్తైన రామ మందిర నిర్మాణం జరగనుంది. సంప్రదాయ మందిరంతో పాటు.. అంతకుమంచి పలు సౌకర్యాలను కల్పించనున్నట్టు డాక్టర్ హరేంద్ర రాణా తెలిపారు. దీప ద్వారం, చిత్రకూట్ వాటిక, పంచవటి వాటిక పేరుతో ఉద్యనవనాలు, రామ్ నివాస్ హోటల్, సీతా రసోయి రెస్టారెంట్, రామాయణ సదన్ గ్రంథాలయం, తులసీదాస్ హాల్ వంటి సౌకర్యాలు ఉంటాయని పేర్కొన్నారు. యోగా కేంద్రం, ధ్యాన మందిరం, వేద అధ్యయనం, పరిశోధన కేంద్రం, మ్యూజియం కూడా ఉంటాయని చెప్పారు. పర్యావరణానికి ప్రాధాన్యం ఇస్తూ సోలార్ ప్లాంటుతో పాటు కర్బన రహిత వాతావారణాన్ని నెలకొల్పనున్నట్లు డాక్టర్ హరేంద్ర రాణా వెల్లడించారు.