ఉత్తర కొరియా పేరు చెబితేనే ప్రపంచం మొత్తం వణికిపోతుంది. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. తీసుకునే నిర్ణయాలు, తీసుకొచ్చే చట్టాలు, విధించే శిక్షలు వింటేనే ఒళ్లు గగుర్పొడుస్తూ ఉంటుంది. ప్రపంచమే భయపడే విధంగా అక్కడి శిక్షలు ఉంటాయి. అయితే తాజాగా అక్కడి ప్రభుత్వం విధించిన ఓ శిక్ష గురించి వింటేనే భయం వేస్తుంది. అది కూడా పెద్ద తప్పు కూడా కాదు. ఇద్దరు మైనర్లు.. ఓ వీడియో చూసినందుకు వారికి 12 ఏళ్ల పాటు జైలు శిక్ష, కఠిన శ్రమ విధించాలని నిర్ణయించారు. దీంతోపాటు ఆ ఇద్దరు మైనర్లకు బహిరంగంగా శిక్ష విధించారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో బయటికి రావడం ప్రస్తుతం సంచలనంగా మారింది.
అయితే అసలు ఆ ఇద్దరు మైనర్లు చేసిన ఏంటంటే దక్షిణ కొరియాకు సంబంధించిన వీడియో చూడటమే. అదేదో చూడకూడని వీడియోనో, సీక్రెట్ వీడియోనో కాదు. దక్షిణ కొరియాకు సంబంధించిన సినిమా పాట. ఇద్దరు 16 ఏళ్ల వయసు ఉన్న అబ్బాయిలు.. దక్షిణ కొరియాకు సంబంధించి కే పాప్ పాట చూసినందుకు వారికి శిక్ష విధించారు. ఈ సంఘటన ఉత్తర కొరియాలోని పెద్ద నగరమైన ప్యాంగ్యాంగ్‌కు చెందినట్లు భావిస్తున్నారు. దోషులుగా తేలిన తర్వాత ఆ ఇద్దరు అబ్బాయిలకు శిక్ష విధించిన ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.
అయితే ఈ ఘటన పాతది అని తెలుస్తోంది. ఎందుకంటే ఆ వీడియోలో కనిపిస్తున్న చాలా మంది మాస్క్‌లు ధరించి ఉన్నారు. కాబట్టి అది కోవిడ్ వైరస్ విజృంభించిన సమయంలో జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఉత్తర కొరియాలో వింత వింత చట్టాలు అమలు చేసిన సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. 2020 లో కిమ్ జోంగ్ ఉన్న ఒక కొత్త చట్టాన్ని తీసుకువచ్చారు. విదేశీ ఆలోచనల ప్రభావానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశం. ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత దక్షిణ కొరియా లేదా ఇతర దేశాలకు చెందిన ఎంటర్‌టైన్‌మెంట్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు చూసిన వారికి కఠిన శిక్షలు విధిస్తారు. దీంతోపాటు దక్షిణ కొరియన్లు మాట్లాడే విధానాన్ని అనుకరించినా వారికి శిక్షలు వేస్తారు.