ప్రభుత్వ అనాలోచిత, మొండివైఖరి కారణంగా ఇప్పటికే ఇద్దరు అంగన్వాడీ చెల్లెమ్మలు మృతిచెందారని టీడీపీ యువనేత లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ అంగన్వాడీలపై ప్రయోగించిన ఎస్మా ఆయన పాలిట భస్మాసుర హస్తంగా మారబోతోందన్నారు. ఎంతటి నియంత అయినా ప్రజాభీష్టానికి తలొగ్గక తప్పదన్న చారిత్రక సత్యాన్ని గుర్తించలేని జగన్... మరో 3నెలల్లోపే ఇంటికి వెళ్లడం ఖాయమని హెచ్చరించారు. 40 రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. టీడీపీ - జనసేన నేతృత్వంలో రాబోయే ప్రజా ప్రభుత్వం అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తుందని నారా లోకేష్ హామీ ఇచ్చారు.