చంద్రబాబు నాయుడు వదిలిన చివరి అస్త్రం షర్మిల అంటూ విమర్శలు చేశారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. తెలంగాణలో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి.. ఇక్కడ అవకాశం లేదు పొమ్మంటే, వైఎస్ షర్మిలను ఏపీలో నేను ఉపయోగించుకుంటా అని చంద్రబాబు తెచ్చుకున్నట్లు కనపడుతోందని అన్నారు. షర్మిలను చూస్తే జాలేస్తోందన్నారు. వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ ఎంతగా వేధించిందో అందరికీ తెలుసని.. అలాంటి పార్టీలో చేరగానే షర్మిల యాస, భాష మారాయని సజ్జల అన్నారు. గత ఎన్నికల్లో నోటాకు వచ్చిన ఓట్లు కూడా ఏపీలో కాంగ్రెస్‌కు రాలేదని ఎద్దేవా చేశారు. జగన్‌ను జైలుకు పంపించింది కాంగ్రెస్ పార్టీ అని సజ్జల అన్నారు. ఇన్నాళ్లు తెలంగాణలో ఏం చేశారు? ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు? అంటూ షర్మిలను ఉద్దేశించి ప్రశ్నించారు. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా.. ఏపీకి మేలు చేయాలనే భావనతోనే సీఎం జగన్ నడుచుకుంటున్నారని సజ్జల అన్నారు.