భారత వైద్య చరిత్రలో అరుదైన ఆపరేషన్లు జరిగాయి. ఇద్దరు వ్యక్తులకు డాక్టర్లు విజయవంతంగా చేతులను అమర్చారు. ఈ అరుదైన సంఘటన హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఉన్న అమృత ఆస్పత్రిలో జరిగింది. దీంతో ఉత్తర భారత దేశంలో తొలిసారి ఇలాంటి శస్త్రచికిత్స చేసిన ఆస్పత్రిగా నిలిచింది. ఇద్దరు వ్యక్తులకు ఒకేసారి ఈ చేతులు అమర్చే ఆపరేషన్లు నిర్వహించారు. 17 గంటల్లో ఈ ఆపరేషన్లను పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి బాగానే ఉందని.. వారు కోలుకుంటున్నారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
ఢిల్లీకి చెందిన గౌతమ్ తయల్ అనే 64 ఏళ్ల వృద్ధుడికి కొన్నేళ్ల క్రితం ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో తన ఎడమ చేతిని గౌతమ్ తయల్ కోల్పోయారు. అయితే 10 సంవత్సరాల క్రితం ఆయనకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కూడా జరిగింది. అయితే ఇటీవల బ్రెయిన్ డెడ్‌తో మరణించిన ఓ 40 ఏళ్ల వ్యక్తికి చెందిన చేతిని.. అమృత ఆస్పత్రి డాక్టర్లు గౌతమ్ తయల్‌కు విజయవంతంగా అమర్చారు. ఆ ఆపరేషన్ సక్సెస్ అయినట్లు అమృత హాస్పిటల్ మేనేజ్‌మెంట్ ప్రకటించింది. ప్రస్తుతం గౌతమ్ తయల్ అతికించిన చేతికి ఉన్న వేళ్లను కదిలించగలుగుతున్నాడని డాక్టర్లు తెలిపారు.
త్వరలోనే గౌతమ్ తయల్‌ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. దీంతో దేశంలో కిడ్నీ, చేతిని మార్పించుకున్న తొలి వ్యక్తిగా గౌతమ్ తయల్ రికార్డు సృష్టించాడు. ఇక ప్రపంచంలో ఈ తరహా ఆపరేషన్ చేయించుకున్న రెండో వ్యక్తి గౌతమ్ తయల్ కావడం విశేషం. మరోవైపు.. 3 ఏళ్ల క్రితం జరిగిన ఓ రైలు ప్రమాదంలో దేవాన్ష్ గుప్తా అనే 19 ఏళ్ల యువకుడు తన రెండు చేతులను కోల్పోయాడు. ఆ దేవాన్ష్ గుప్తాకు కూడా ఇదే అమృత ఆస్పత్రి డాక్టర్ల బృందం విజయవంతంగా చేతులను అమర్చింది. బ్రెయిన్ డెడ్‌తో మరణించిన 33 ఏళ్ల వ్యక్తికి చెందిన రెండు చేతులను సేకరించి.. దేవాన్ష్ గుప్తాకు అతికించారు. గతేడాది డిసెంబరులో నిర్వహించిన ఈ 2 ఆపరేషన్లను 17 గంటల్లో పూర్తి చేసినట్లు అమృత ఆస్పత్రి యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొంది.