ప్రస్తుతం ఎక్కడ చూసినా రామ నామమే వినిపిస్తోంది. కేవలం భారత దేశంలోనే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాల్లో అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం గురించి చర్చ జరుగుతోంది. విదేశాల్లో ఉన్న హిందువులు కూడా అక్కడి ఆలయాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అంతరిక్షం నుంచి తీసిన అయోధ్య రామాలయ ఫోటోలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో విడుదల చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ శాటిలైట్ ఫోటోలలో అయోధ్య రామ మందిరం స్పష్టంగా దర్శనం ఇస్తోంది. ఆలయంతోపాటు దశరథ్ మహల్, సరయూ నది కూడా ఆ ఫోటోల్లో కనిపిస్తున్నాయి. వీటితోపాటు కొత్తగా పునరుద్ధరించబడిన అయోధ్య రైల్వే స్టేషన్ కూడా వాటిలో కనిపిస్తోంది. ప్రస్తుతం అంతరిక్షంలో భారత్‌కు చెందిన 50కి పైగా ఉపగ్రహాలు పరిభ్రమిస్తూ భూమికి సమాచారాన్ని అందిస్తున్నాయి. వాటిలో కొన్ని ఒక మీటర్ కంటే తక్కువ రిజల్యూషన్ కలిగి ఉన్నవి కూడా ఉన్నాయి.
హైదరాబాద్‌లో ఉన్న ఇండియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఫోటోలు తీసే పనిని చేపట్టింది. 2.7 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న శ్రీరామ ఆలయాన్ని శాటిలైట్ ఫోటోల్లో చూడవచ్చు. 2023 డిసెంబర్ 16 వ తేదీన నిర్మాణంలో ఉన్న రామ మందిరం ఫొటోలను శాటిలైట్ తీసింది. భారతీయ రిమోట్ సెన్సింగ్ సిరీస్ ఉపగ్రహాలను ఉపయోగించి.. దాని వివరణాత్మక వీక్షణ కూడా చూపబడింది.