ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నా మనసు మార్చుకున్నా.. స్టిక్కర్ ఎమ్మెల్యేగా ఉండలేను: వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 22, 2024, 07:19 PM

నందికొట్కూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్థర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐప్యాక్‌ సర్వేలో రాష్ట్రంలో తనకే ఎక్కువ శాతం అనుకూలంగా వచ్చిందని.. కానీ ఎందుకో తనకు టికెట్‌ దక్కలేదన్నారు. నందికొట్కూరులో ఎప్పటి నుంచో ఇంఛార్జ్ పెత్తనం కొనసాగుతూనే ఉందన్నారు. ఆర్థర్ కర్నూలులో నియోజకవర్గ నాయకులతో సమావేశం అయ్యారు.. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. నందికొట్కూరు టికెట్‌ ఇస్తాం కానీ.. పాలన బాధ్యతలు వేరేవారికి అప్పగిస్తామని ప్రాంతీయ సమన్వయకర్త రామసుబ్బారెడ్డి, ఐప్యాక్‌ రాయలసీమ ఇంఛార్జ్ దివాకర్‌రెడ్డి అన్నారన్నారు. ఆ వ్యాఖ్యలు విని తాను షాకయ్యానన్నారు.


తాను ప్రభుత్వ కార్యక్రమాలకే పరిమితం కావాలని.. మిగిలిన వ్యవహారాలను వేరే గ్రూప్‌ చూసుకుంటుందన్నారు. నియోజకవర్గంలో పాలన వేరే వారికి అప్పగించడానికి తాను చదువురానివాడినా.. అని ప్రశ్నించినట్లు చెప్పుకొచ్చారు. గతంలో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మంత్రిగా విధులు నిర్వర్తించారని.. ఆయనకు చెప్పకుండా ఓఎస్డీగానీ, ఇతరులుగానీ వ్యవహారాలు చక్కబెడితే అంగీకరిస్తారా అని తాను కూడా ప్రశ్నించినట్లు చెప్పారు. పదవితోపాటు అధికారమూ తనకు ఉండేటట్లయితేనే టికెట్‌ ఇవ్వాలని చెప్పానన్నారు.


సజ్జల రామకృష్ణారెడ్డిని గతంలో మూడుసార్లు కలిశానని.. తన పనితీరు రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉన్నట్లు చెప్పారు. సజ్జల తప్పకుండా సీటు వస్తుందని హమీ ఇచ్చారన్నారు.. కానీ టికెట్ ఇవ్వలేదన్నారు. టికెటూ తనకే ఇస్తారన్నారని.. కానీ ఊహించని విధంగా సమన్వయకర్తగా మరొకరిని నియమించారన్నారు. అందుకే ఇంటి బాధ్యతలు చూసుకుందామని భావించానని.. కానీ నమ్ముకున్న నాయకులు, కార్యకర్తల కోసం ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు. రెండు రోజుల్లో తన నిర్ణయం చెబుతానన్నారు. ఎక్కువమంది అనుచరులు పార్టీ మారాలని సూచించారు.


నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ కార్యకర్తల సమావేశంలో వారి అభిప్రాయాలను సేకరించారు. 'అధిష్టానానికి మనం అవసరం లేనప్పుడు మనం కూడా ఆ పార్టీలో ఉండాల్సిన అవసరం లేదని' కార్యకర్తలు ఎమ్మెల్యేకు సూచించారు. భవిష్యత్తు కార్యచరణపై ఎమ్మెల్యే త్వరగా నిర్ణయం తీసుకోవాలని కార్యకర్తలు ఎమ్మెల్యేను కోరారు. తనను స్టిక్కర్ ఎమ్మెల్యేగా ఉండాలని అధిష్టానం కోరడంతో తాను అంగీకరించనందుకే టికెట్ ఇవ్వలేదన్నారు ఎమ్మెల్యే ఆర్థర్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa