రాష్ట్రంలోని అన్ని వర్గాలతోపాటు బీసీలను ఆదుకునేది టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడేనని జమ్మలమడుగు టీడీపీ ఇన్‌చార్జి భూపేశ్‌రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక టీడీపీ కార్యాలయ ఆవరణలో క్షేత్రస్థాయిలో బీసీల సమస్యలు గుర్తించి వారి నుంచే నాయకుల్ని వెలికితీసే కార్యక్రమంలో భాగంగా ‘జయహో బీసీ’ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో భూపేశ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అన్న లక్ష్యంతో నందమూరి తారకరామారావు టీడీపీని ఏర్పాటు చేశారన్నారు. ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు బీసీలకు తగిన ప్రాధాన్యం కల్పిస్తూ సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు. ముఖ్యమంత్రి జగన్ సైకోలాగా మారి బీసీలను పట్టించుకోలేదన్నారు. బీసీలంతా ఏకమై 2024 ఎన్నికల్లో సైకో జగన్‌ను గద్దె దించి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి కొండయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుమలకొండయ్య, మున్సిపాలిటీ పరిధిలోని బీసీ నేతలు పాల్గొన్నారు. అనంతరం అయోధ్యలో బాలరాముడు విగ్రహ ప్రతిష్ఠ పురష్కరించుకుని పట్టణంలోని రామాలయాల్లో పూజలు నిర్వహించారు.