ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్‌ను సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది. ఐఆర్ఆర్ కేసులో ఈ నెల 10న చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంలో సవాలు చేసింది. చంద్రబాబు బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ నెల 29న ఈ కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ కేసులో అక్రమాలు జరిగాయని ఏపీలోని జగన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ మేరకు గత ప్రభుత్వ హయాంలో స్కాం జరిగిందని సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబు పేరును కూడా చేర్చింది. అయితే అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డు వేయాలని నిర్ణయించారే తప్ప రోడ్డు వేయలేదని, భూసేకరణ జరగలేదని, పైసా నిధులు కూడా ఇవ్వలేదని, అలాంటప్పుడు అధికార దుర్వినియోగం, అవినీతి ఎలా జరుగుతుందని టీడీపీ ప్రశ్నిస్తోంది. రోడ్డు నిర్మాణం జరిగితే దాని వల్ల ఎవరైనా లబ్ధి పొందారేమోనని అనుకోవచ్చని, ఏదీ జరగకున్నా ఎవరికో లబ్ధి జరిగిందని ఊహించి కేసులు పెడతారా? అని టీడీపీ ప్రశ్నిస్తోంది.