పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంలో దీదీ తలకు తీవ్ర గాయమైనట్టు తెలుస్తోంది. బుధవారం బుర్ధ్వాన్‌లో కార్యక్రమం ముగించుకుని రోడ్డు మార్గంలో కోల్‌కతాకు మమతా బెనర్జీ తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సీఎం కాన్వాయ్‌లోని మరో కారు అడ్డు రావడంతో ఒక్కసారిగా మమతా కారు డ్రైవర్ సడన్ బ్రేక్‌లు వేశాడు. దీంతో ముందు సీటులో ఉన్న సీఎం.. ఒక్కసారిగా తూలి ముందుకుపడ్డారు. ఈ ప్రమాదంలో మమతా బెనర్జీ నుదుటికి గాయమైనట్లు అధికారులు తెలిపారు. వాస్తవానికి, హెలికాఫ్టర్‌లో కోల్‌కత్తాకు తిరుగు ప్రయాణం కావాల్సి ఉంది. కానీ, ప్రతికూల వాతావరణం కారణంగా సీఎం రోడ్డు మార్గంలో బయలుదేరారని, మార్గం మధ్యలో ప్రమాదం జరిగినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.