అయోధ్యలో రామ మందిర నిర్మాణం అనేది కోట్లాది మంది హిందువుల కల. 500 ఏళ్ల నాటి ఈ కలను నెరవేరస్తూ.. జనవరి 22న బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించిన సంగతి తెలిసిందే కదా. ఆ రోజు దేశం దృష్టి మొత్తం అయోధ్య రామాలయంపైనే నిలిచింది. వందల ఏళ్లగా ఎదురు చూస్తున్న హిందువుల ఆకాంక్షలు నెరవేరేస్తూ. ఆ బాల రాముడు అయోధ్య మందిరంలో కొలువు దీరిన సమయాన దేశం మొత్తం జై శ్రీరామ్ నినాదాలతో పులకరించింది.
భారీ ఖర్చుతో నిర్మిస్తోన్న అయోధ్య మందిరంలో ప్రతిష్టించేందుకు ముగ్గురు శిల్పులు రాముడి విగ్రహాలను చెక్కిన సంగతి తెలిసిందే. వీరిలో అరుణ్ యోగి రాజ్, గణేశ్ భట్ కర్ణాటకకు చెందిన వారు కాగా.. మరొకరు రాజస్థాన్‌కు చెందిన సత్యనారాయణ పాండే. రామ జన్మభూమి ట్రస్ట్ ఓటింగ్ ద్వారా మైసూర్‌కు చెందిన అరుణ్ యోగి చెక్కిన బాల రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించింది. రాజస్థాన్ శిల్పి చెక్కిన పాలరాతి విగ్రహాన్ని సైతం ఆలయంలో మరో చోట ఉంచుతామని ట్రస్ట్ తెలిపింది. పాలరాతితో చెక్కిన ఆ విగ్రహం ఫొటోలు కూడా బయటకు వచ్చాయి.
దీంతో ఆ మూడో విగ్రహం ఎలా ఉంటుందో చూడాలని చాలా మంది తహతహలాడుతున్నారు. అరుణ్ యోగి రాజ్ కృష్ణ శిలను చెక్కినట్లుగానే.. గణేశ్ భట్ సైతం నల్లరాతితోనే రాముడి విగ్రహాన్ని చెక్కారు. ఈ విగ్రహాన్ని ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఆయన రూపొందించారు. రాముడి వెనుక భాగంలోని అర్ధ చంద్రాకృతిపై దశావతారాలను చిత్రీకరించారు.
అరుణ్ యోగి చెక్కిన మూర్తి బాణం, విల్లు చేతిలో పట్టుకునే భంగిమలో ఉంది. కానీ విగ్రహం చేతుల్లో అవి లేవు. కానీ గణేశ్ భట్ చెక్కిన విగ్రహానికి ఓ చేతిలో విల్లు ఉండగా.. మరో చేతిలో బాణం ఉంది. బాల రాముడి విగ్రహంతో పోలిస్తే.. ఈ విగ్రహాన్ని చూసినప్పుడు రాముడు కాస్త పెద్దవాడిలా కనిపిస్తున్నాడు. పద్మపీఠంపై నిలబడిన రాముడికి భుజం భాగంలో ఓవైపు బ్రహ్మ, మరోవైపు లక్ష్మీ దేవి ఉండగా.. కిందన ఓవైపు హనుమంతుడు, మరోవైపు గరుత్మంతుడు కొలువుదీరారు. రాముడి కిరీటంపై సూర్య భగవాణ్ని సైతం ఆయన మలిచారు.
ఒక్క ముఖం విషయంలో కొంచెం వెనుకంజ వేసిందేమో గానీ లేకపోతే.. ఈ విగ్రహం ఎంపికైన విగ్రహానికి గట్టి పోటీ ఇచ్చేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. బాల రాముడికి ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్న ఈ విగ్రహాన్ని రామ జన్మభూమి ట్రస్ట్ ఆలయంలో ఎక్కడైనా ఉంచుతుందేమో చూడాలి.