హిందువుల ఐదు శతాబ్దాల కల అయోధ్యలో రామ మందిరం నిర్మాణం సాకరమైంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జనవరి 22న జరిగింది. జన్మభూమిలో కొలువుదీరిన అయోధ్య రాముడి దర్శనాలకు భారీగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో క్యాబినెట్ సహచరులకు ప్రధాని మోదీ ఓ సలహా ఇచ్చారు. మార్చి వరకూ అయోధ్యకు వెళ్లాలనే ప్లాన్‌ను విరమించుకోవాలని మోదీ సూచించారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సామాన్య భక్తులు అయోధ్యకు భారీ సంఖ్యలో తరలి వెళ్తున్నారని.. వారికి ఇబ్బంది కలిగించొద్దని ప్రధాని కోరినట్టు తెలిపాయి.
కేంద్ర మంత్రులు లాంటి వీఐపీలు వెళ్తే ప్రోటోకాల్స్ కారణంగా భక్తులకు ఇబ్బందులు తలెత్తుతాయని ప్రధాని మోదీ సూచించారని సమాచారం. సాధ్యమైనంత మేర ఫిబ్రవరి చివరి వరకూ వాయిదా వేసుకోవాలని, మార్చిలో రామయ్య దర్శనానికి వెళ్తే బాగుంటుందని చెప్పారు. ఆ సమయానికి దేశ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు అయోధ్యలో రాముడి దివ్వ స్వరూపాన్ని దర్శించుకుంటారని కేంద్ర మంత్రులకు మోదీ సలహా ఇచ్చారు. సామాన్యులకు దర్శనం సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని ప్రధాని మోదీ భావించారని సమాచారం.
కాగా, మంగళవారం నుంచి అయోధ్యలో సామాన్యులకు దర్శనాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు 5 లక్షల మంది దర్శించుకున్నట్టు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. బుధవారం 3 లక్షల మంది ఆలయం వద్ద క్యూలైన్‌లో ఉన్నారు. దీంతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేశారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్.. అధికారులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రద్దీ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ప్రముఖులు దర్శనానికి వస్తే ముందుగా అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
‘దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అయోధ్య ధామానికి తరలివస్తున్నారు.. తమ ఆరాధ్య దైవం శ్రీరాముని దర్శనం కోసం ఆసక్తిగా ఉన్నారు. అసాధారణమైన రద్దీ నేపథ్యంలో వీఐపీలు, ప్రముఖులు తమ సందర్శనను షెడ్యూల్‌ను ఒక వారం ముందుగానే స్థానిక అధికారులు, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ లేదా యూపీ ప్రభుత్వానికి తెలియజేయడం సముచితంగా ఉంటుంది’ అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.