సోమవారం అయోధ్యలో కొలువైన బాలక్ రామ్‌ను చూసేందుకు దేశ వ్యాప్తంగా భక్తులు అయోధ్యకు తరలివస్తున్నారు. దీంతో భక్తుల రద్దీతో అయోధ్య నగరం నిండిపోయింది. వారిని అదుపు చేసేందుకు అక్కడ భద్రతా సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయినప్పటికీ క్యూలైన్లు కిక్కిరిసిపోయి తోపులాటలు చోటు చేసుకుంటున్నాయి. ఒకానొక దశలో భద్రతా సిబ్బందిని నెట్టేసి మరీ భక్తులు అయోధ్య రామ మందిరంలోకి పరిగెత్తిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని లక్నో నుంచి అయోధ్యకు బస్ సర్వీసులు నిలిపివేస్తున్నట్లు తెలిపింది. అయోధ్యలో భక్తుల రద్దీ తగ్గి సాధారణ స్థితికి వచ్చే వరకు లక్నో నుంచి అయోధ్యకు బస్సులు బంద్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
సోమవారం అయోధ్య రామ మందిరం నిర్వహించగా.. గర్భగుడిలో ఉన్న బాలరాముడి దర్శనం కోసం భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రాణప్రతిష్ఠ తర్వాతి రోజు నుంచి అంటే మంగళవారం నుంచి సాధారణ భక్తులను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అనుమతించింది. ఈ నేపథ్యంలోనే తొలిరోజు భారీగా భక్తులు ఆలయానికి చేరుకున్నారు. మంగళవారం రోజు సుమారు 5 లక్షల మంది అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు వచ్చారని తెలిపారు. అందులో 3 లక్షల మంది మాత్రమే దర్శనాలు చేసుకున్నారని.. మిగిలిన 2 లక్షల మంది క్యూలైన్లలోనే వేచి ఉన్నట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు.. బుధవారం కూడా పెద్ద సంఖ్యలో తరలి రావడంతో అయోధ్యలో భక్తులతో కిటకిటలాడి పోయింది. ఈ నేపథ్యంలోనే అయోధ్యలో భక్తుల రద్దీని తగ్గించేందుకు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. లక్నో నుంచి అయోధ్యకు బస్సు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ప్రైవేటు వాహనాలను కూడా అయోధ్య నగరంలోకి అనుమతించడం లేదని స్పష్టం చేశారు. అయోధ్యలో భక్తుల రద్దీ తగ్గిన తర్వాతే బస్సు సర్వీసులను పునరుద్ధరిస్తామని ఉత్తర్‌ప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. దీంతో అయోధ్యకు వెళ్లాలనుకునే రామ భక్తులకు పెద్ద షాక్ తగిలినట్లయింది.
ఇక అయోధ్యలో భక్తుల రద్దీని నివారించేందుకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అయోధ్య ఐజీ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం 8 వేల మంది యూపీ పోలీసులు, సశస్త్ర సీమా బల్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బృందాలతో అయోధ్య ఆలయం వద్ద భద్రతా ఏర్పాట్లను చేసినట్లు వివరించారు. మరోవైపు.. అయోధ్య నగరంలోని వివిధ ప్రాంతాల్లో 8 మంది కలెక్టర్లను ఇంఛార్జ్‌లుగా నియమించినట్లు ప్రభుత్వం తెలిపింది.
అయోధ్య బాలరాముడిని దర్శించుకునేందుకు భక్తులు తొందరపడాల్సిన అవసరం లేదని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం అయోధ్యలో భారీగా రద్దీ ఉందని తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులు 2 వారాల తర్వాతే అయోధ్యకు వచ్చేలా వారి ప్రయాణాలను షెడ్యూల్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.