ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అయోధ్య కోసం చెక్కిన బాలరాముడి మూడో విగ్రహం ఫోటోలు విడుదల

national |  Suryaa Desk  | Published : Wed, Jan 24, 2024, 10:22 PM

అయోధ్యలో 51 అంగుళాల ఎత్తైన దివ్యమైన బాలరాముడి విగ్రహం కొలువుదీరింది. అయితే అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ 3 విగ్రహాలను తయారు చేయించింది. ఒక విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠించగా.. మరో విగ్రహానికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే బయటికి వచ్చాయి. ఇక చివరగా మిగిలిన మూడో బాల రాముడి విగ్రహం ఫోటో కూడా వైరల్‌గా మారింది. దీంతో అయోధ్యలో ఉంచేందుకు తయారు చేసిన మూడు రాముడి విగ్రహాలకు సంబంధించిన ఫోటోలు బయటికి వచ్చినట్లు అయింది.


కర్ణాటకలోని మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన కృష్ణ శిల విగ్రహాన్ని అయోధ్య రామ మందిరంలో ప్రతిష్ఠించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఖరారు చేసింది. మొత్తం 3 విగ్రహాలు చెక్కించిన ఆలయ ట్రస్ట్ మిగితా వాటిని పక్కన పెట్టింది. అయితే కర్ణాటకకే చెందిన మరో శిల్పి గణేష్ భట్ చెక్కిన బాల రాముడి విగ్రహానికి చెందిన ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది.


గణేష్ భట్ కూడా కృష్ణ శిలతోనే బాల రాముడి విగ్రహాన్ని తయారు చేశారు. ఇక మరో విగ్రహాన్ని రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన సత్యనారాయణ పాండే అనే శిల్పి తయారు చేశారు. తెల్లని మక్రానా పాలరాతితో రూపొందించిన ఆ విగ్రహానికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే విడుదల అయ్యాయి. అయితే ఈ మూడు విగ్రహాలు కూడా ఒకే ఎత్తులో 51 అంగుళాలు ఉండేలా చెక్కాలని శిల్పులకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సూచించింది.


అయితే తయారు చేయించిన 3 విగ్రహాల్లో ఒకటి అయోధ్య గర్భగుడిలో ప్రతిష్ఠించగా.. మరో రెండు విగ్రహాలు ప్రస్తుతం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వద్దే ఉన్నాయి. ఆ విగ్రహాలను అయోధ్య ఆలయంలోనే ప్రతిష్ఠించనున్నట్లు ఇప్పటికే ట్రస్ట్ వర్గాలు వెల్లడించాయి. అయోధ్య ఆలయాన్ని మొత్తం 3 అంతస్థుల్లో నిర్మిస్తుండగా.. ప్రధాన గర్భగుడి గ్రౌండ్ ఫ్లోర్‌లో ఏర్పాటు చేశారు. ఇక మొదటి, 2 అంతస్థుల్లో కూడా ఆలయాలు నిర్వహిస్తామని తెలిపారు. అయితే ఈ మిగిలిన రెండు విగ్రహాలను రెండు అంతస్థుల్లో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com