వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని బలమైన బీజేపీని ఎదుర్కొడానికి ‘ఇండియా’ పేరుతో ప్రతిపక్ష పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. అయితే, ఎన్నికలకు ముందే కూటమిలో విబేధాలు మొదలయ్యాయి. తాజాగా, పశ్చిమ్ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) కూటమికి షాకిచ్చారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బెంగాల్‌లో ఒంటిరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు. సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్‌తో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని, ఫలితాల తర్వాతే పొత్తుపై తుది నిర్ణయం తీసుకుంటామని మమతా బెనర్జీ వెల్లడించారు.
‘బెంగాల్ వరకు సీట్ల పంపకం విషయంలో కాంగ్రెస్‌తో మా పార్టీ ఎటువంటి సంప్రదింపులు జరపలేదు.. బెంగాల్‌లో మేము ఒంటిరిగానే పోటీ చేస్తామని ఎప్పుడూ చెబుతున్నాను.. ఈ అంశంపై మేం ఇప్పటివరకు ఆ పార్టీలో ఎవరితోనూ మాట్లాడలేదు.. నేను వారికి (కాంగ్రెస్‌కి) చాలా ప్రతిపాదనలు ఇచ్చాను... కానీ వారు వాటిని తిరస్కరించారు. దేశంలో మిగతా చోట్ల ఏమి జరుగుతుందనే దాని గురించి నాకు ఆందోళన లేదు... కానీ మాది సెక్యులర్ పార్టీ.. బెంగాల్‌లో మేము ఒంటరిగా బీజేపీని ఓడిస్తాం. ఎన్నికల తర్వాత అఖిల భారతస్థాయిలో నిర్ణయం తీసుకుంటాం..’ అని మమత స్పష్టం చేశారు.
బెంగాల్‌లోని మొత్తం 42 పార్లమెంట్ స్థానాలకుగానూ రెండింటిని మాత్రమే కాంగ్రెస్‌కు ఇవ్వడానికి టీఎంసీ ప్రతిపాదించినట్టు సమాచారం. కానీ, కాంగ్రెస్ మాత్రం 10 నుంచి 12 సీట్లు డిమాండ్ చేసిందని తెలిసింది. దీనికి బెంగాల్ సీఎం అంగీకరించని నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌధరి ఆమెపై విమర్శలు గుప్పించారు. ఆమె అవకాశవాదని, సొంత బలంతో పోటీ చేయడం ఎలాగో కాంగ్రెస్‌కు తెలుసని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాల మధ్యే బెంగాల్ సీఎం తాజా ప్రకటన చేయడం గమనార్హం.
2014 లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లో కాంగ్రెస్ 4 స్థానాలు గెలుచుకోగా.. గత ఎన్నికల్లో రెండుకు పడిపోయింది. ఇది కూడా ఆ పార్టీతో పొత్తుకు టీఎంసీ అనాసక్తికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ నేతృత్వంలో జరుగుతోన్న భారత్ జోడో న్యాయ యాత్ర గురువారం బెంగాల్‌లోకి ప్రవేశించనున్న వేళ.. మమత విమర్శలు గుప్పించారు.‘వారు మా రాష్ట్రానికి వస్తున్నారు.. మేము ఇండియా కూటమిలో భాగమైనప్పటికీ దాని గురించి నాకు సమాచారం ఇవ్వాలన్న మర్యాద వారికి లేదు.. కాబట్టి బెంగాల్‌కు సంబంధించినంత వరకూ ఎలాంటి సంబంధాలు లేదు’ అని ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
అయితే, సోనియా గాంధీతో దీదీకి మంచి సాన్నిహిత్యం ఉంది. కానీ ఇటీవల కాలంలో ఆ సంబంధాలు దెబ్బతిన్నాయి. బెంగాల్‌లో తన మిత్రపక్షాన్ని పోటీకి అనుమతించడాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని ఆమె గతంలో కూడా స్పష్టం చేశారు. ‘భారత్‌లో ఇండియా ఉంటుంది (కానీ) బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పోరాడుతుంది.. బెంగాల్‌లో తృణమూల్ మాత్రమే బీజేపీకి గుణపాఠం చెప్పగలదు.. అది దేశానికి విజయ పథాన్ని చూపగలదు..." అని ఆమె అన్నారు.