ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న డిమాండ్‌కు ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు.. టెస్లా, స్పేస్ ఎక్స్, ట్విటర్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ మద్దతు పలికారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్‌కు ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందని ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్యసమితిలో ఆఫ్రికాకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలనే డిమాండ్‌పై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ చేసిన ట్వీట్‌కు ఎలాన్ మస్క్ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలుు అవసరమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఐక్యరాజ్య సమితిలోని సంస్థలను సమీక్షించాల్సిన అవసరం ఉందని.. ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. ఎక్కువ అధికారం ఉన్న దేశాలు దాన్ని వదులుకోవడానికి ఇష్టపడవని... ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్నప్పటికీ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇవ్వకపోవడం విడ్డూరమని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఆఫ్రికాకు కూడా సమిష్టిగా స్థానం కల్పించాలని ఆ ట్వీట్‌లో ఎలాన్ మస్క్ రాసుకొచ్చారు.
అంతకుముందు భద్రతా మండలిలో ఆఫ్రికాకు ఒక్క శాశ్వత సభ్యుడు కూడా లేరని ఎలా అంగీకరిస్తామంటూ ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ట్వీట్ చేశారు. 80 ఏళ్ల క్రితం ప్రపంచాన్ని కాకుండా ఐక్యరాజ్య సమితిలో నేటి ప్రపంచాన్ని ప్రతిబింబించేలా ఉండాలని పేర్కొన్నారు. సెప్టెంబరులో జరిగే శిఖరాగ్ర సమావేశం ప్రపంచ పాలనపై పునరాలోచించడానికి.. పునరుద్ధరించడానికి ఒక అవకాశమని ఈ సందర్భంగా తెలిపారు. అయితే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వానికి సంబంధించి ఇటీవల విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలోనే భారత్‌కు ఎలోన్ మస్క్ మద్దతు అందించారు. ప్రపంచం ఏదీ తేలికగా ఇవ్వదని.. కొన్నిసార్లు అది కూడా తీసుకోవలసి ఉంటుందని జై శంకర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఇక ఐక్యరాజ్యసమితిలో భారత్‌కు శాశ్వత హోదా లభించకపోవడానికి ప్రధాన అడ్డంకిగా చైనా నిలిస్తోంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం లభిస్తే.. ఆసియాలో తమ ప్రభావం తగ్గుతుందని డ్రాగన్ తీవ్రంగా భయపడుతోంది. దాని కోసం అన్ని రకాల ఎత్తుగడలు వేస్తోంది. ఒక్క చైనా మాత్రమే కాకుండా పాకిస్థాన్ కూడా భారత్‌కు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో తరచూ అక్కసును వెళ్లగక్కతూ ఉంటాయి. ఇక భారత్‌కు ఐరాసలో శాశ్వత సభ్యత్వాన్ని జపాన్, జర్మనీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి.