ఓ వ్యక్తి జీవితం మీద విరక్తి చెందాడు. చివరికి ప్రాణాలు తీసుకోవాలని ప్రయత్నం చేశాడు. ఆత్మహత్యకు యత్నించగా.. చివరి క్షణంలో అతడిని బిర్యానీ కాపాడింది. ఆ వ్యక్తి చనిపోకుండా రంగంలోకి దిగిన పోలీసులు.. అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. ఏం చెప్పినా ఆ వ్యక్తి వినలేదు. చివరికి హోటల్ నుంచి బిర్యానీ తెప్పించగానే.. ఆత్మహత్య చేసుకోవాలన్న నిర్ణయాన్ని మానుకుని.. వెనక్కి వచ్చేశాడు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటు చేసుకుంది.
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాకు చెందిన ఓ 40 ఏళ్ల వ్యక్తి టైల్స్ వ్యాపారం చేసేవాడు. బిజినెస్‌లో బాగా నష్టాలు రావడంతో అప్పులు ఎక్కువ అయ్యాయి. భార్యతో గొడవలు రావడంతో ఆమె విడాకులు ఇచ్చి వెళ్లిపోయింది. వారికి ఇద్దరు కుమార్తెలు కాగా.. అందులో చిన్న కూతురు తండ్రిని వదిలేసి వెళ్లింది. ఈ క్రమంలోనే పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. దీంతో జీవితం మీద విరక్తి చెందిన ఆ వ్యాపారి చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే తన పెద్ద కుమార్తెను తీసుకుని బైక్‌పై బయల్దేరాడు.
ఈనెల 22 వ తేదీన మధ్యాహ్నం తన పెద్ద కుమార్తెను వెంటబెట్టుకుని బైక్‌పై సైన్స్ సిటీకి బయల్దేరాడు. ఆ మార్గంలో ఉన్న బ్రిడ్జి వద్దకు వెళ్లగానే బైక్‌ను ఆపేసి.. తన ఫోన్ పడిపోయిందని చెప్పి కుమార్తెను రోడ్డుపై నిలబెట్టాడు. ఆ తర్వాత అక్కడే ఉన్న బ్రిడ్జి పైకి ఎక్కాడు. అక్కడి నుంచి కిందికి దూకేందుకు ప్రయత్నించాడు. దీంతో అక్కడ ఉన్న వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు.. అతడు చనిపోకుండా ఉండేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. ఉద్యోగం ఇస్తామని చెప్పినా ఆ వ్యక్తి కిందికి దిగలేదు. చివరికి కోల్‌కతాలోని ఒక ప్రముఖ రెస్టారెంట్ నుంచి బిర్యానీని తెప్పించారు. దాన్ని చూపించి.. కిందికి దిగి వస్తే ఆ బిర్యానీ ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. దీంతో ఆ బిర్యానీని చూసిన వ్యక్తి వెంటనే కిందికి దిగి వచ్చాడు. దీంతో అక్కడ ఉన్నవాళ్లతోపాటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ వ్యక్తి చేసిన హంగామాతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది.