బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆర్జేడీతో బంధాన్ని తెంచుకుని మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటారనే ప్రచారం జరుగుతోంది. శుక్రవారం మధ్యాహ్నం బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ మద్దతుతో నితీశ్ కుమార్ ఏడోసారి ఆదివారం నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. జేడీయూ చీఫ్ జనవరి 28 తన కార్యకలాపాలన్నింటినీ రద్దు చేసుకున్నారని పేర్కొన్నాయి. ఏడాదిన్నర కిందట 2022లో ఎన్డీఏతో తెగదెంపులు చేసుకుని లాలూ యాదవ్‌కు చెందిన ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
మహారాణా జయంతి సందర్భంగా ఆదివారం జరిగే బహిరంగ సభలో నితీశ్ ప్రసంగించాల్సి ఉంది. అయితే, అంతకు ముందే సీఎం పదవికి రాజీనామా చేసి.. జనవరి 28న బీజేపీ సహకారంతో నితీశ్ ప్రమాణం చేస్తారని సమాచారం. జంపింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నితీశ్.. మరోసారి తన ఆనవాయితీ కొనసాగించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. బిహార్ మాజీ సీఎం, భారతరత్నకు ఎంపికైన కర్పూరీ ఠాకుర్ శత జయంతి వేడుకల సందర్భంగా బుధవారం వారసత్వ రాజకీయాలపై నీతీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. ‘ఇండియా’ కూటమికి ఆయన గుడ్‌బై చెబుతారనే ఊహాగానాలు వెలువడ్డాయి.
వారసత్వ రాజకీయాలపై బిహార్ సీఎం వ్యాఖ్యలను లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య తీవ్రంగా తప్పుబట్టడంతో దీనికి మరింత బలం చేకూరింది. మరోవైపు, బీజేపీ బిహార్ అధ్యక్షుడు సామ్రాట్ చౌధరి గురువారం ఢిల్లీలోని అధిష్ఠానంతో సమావేశమయ్యారు. అయితే వారసత్వ రాజకీయాలపై వ్యాఖ్యలను ఆర్జేడీని ఉద్దేశించి నీతీశ్ చేయలేదని జేడీయూ ప్రకటించింది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్, పంజాబ్‌లలో ఒంటరిగా పోటీ చేస్తామని తృణమూల్ కాంగ్రెస్, ఆప్ ప్రకటించాయి. తాజాగా, నీతీశ్ వ్యాఖ్యలతో ఇండియా కూటమిలో కలకలం రేగింది. నితీశ్ వ్యాఖ్యలపై తొలుత సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందించిన రోహిణి ఆచార్య ఆ తర్వాత ట్వీట్‌ను తొలగించారు.