దేశ వ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే 75 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన పరేడ్‌లో పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వ విభాగాలు ప్రదర్శించిన శకటాలను ప్రదర్శించారు. అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర లిఖిస్తూ భారత్ సాధించిన చంద్రయాన్ 3 విజయం నుంచి మొదలుకుని ఇటీవలె ప్రారంభోత్సవం జరుపుకున్న అయోధ్య రామ మందిరంలో కొలువైన బాలక్ రాముడి వరకు అనేక విషయాలను తెలియజేసేలా ఉన్న శకటాలు సందర్శకుల మనసులను హత్తుకున్నాయి. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన శకటాలు కూడా ఉన్నాయి.
ఈ రిపబ్లిక్ డే పరేడ్‌లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ-ఇస్రో ప్రదర్శించిన శకటంలో చంద్రయాన్ 3, ఆదిత్య ఎల్ 1 ప్రయోగాలకు చెందిన శకటాలు ఆకట్టుకున్నాయి. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ దిగుతున్న దృశ్యాలను ఆ శకటంలో చూపించారు. శకటంపై ఉన్న మహిళా శాస్త్రవేత్తలు జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్ దిగిన శివశక్తి పాయింట్‌ను చూపిస్తున్నట్లు ఉన్న ఆ శకటం కనువిందు చేసింది. ఇక కోట్లాది మంది హిందువుల శతాబ్దాల నాటి కలను నెరవేరుస్తూ ఇటీవలె ప్రాణ ప్రతిష్ఠ జరుపుకున్న అయోధ్య రామ మందిరం కూడా ఈ పరేడ్‌లో ప్రదర్శించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం తరఫున ఉంచిన శకటంలో రామ్ లల్లా చిత్రం ఆకట్టుకుంది. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి గుర్తుగా ఈ శకటాన్ని ప్రదర్శించారు. శకటానికి ముందు విల్లు బాణంతో ఉన్న బాలక్‌రామ్ దర్శనమిచ్చారు. దీంతో పాటు ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళాను చాటిచెప్పే కలశం, అయోధ్య దీపోత్సవ్, హైస్పీడ్ రైళ్లు కూడా ఉన్నాయి.
ఇక ఈ పరేడ్‌లో మణిపుర్ శకటం మరో ప్రత్యేకతగా నిలిచింది. మణిపూర్‌లో 500 ఏళ్ల చరిత్ర కలిగిన ఇమా కెయితల్ మార్కెట్‌ను పరేడ్‌లో ప్రదర్శించారు. అయితే ఈ ఇమా కెయితల్ మార్కెట్‌ను పూర్తిగా మహిళా విక్రయదారులే నడపడడం విశేషం. దీంతోపాటు ప్రపంచంలో మహిళలు నిర్వహిస్తున్న అతిపెద్ద మార్కెట్ ఇదే కావడం మరో విశేషం. మరోవైపు.. కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ శకటంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాన్ని ప్రదర్శించారు. ఆరోగ్యం, విద్య, సామాజిక సాధికారతకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఏ విధంగా ఉపయోగపడుతోందో ఆ శకటంలో వివరించారు.
మరోవైపు.. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ.. భారత్ అధ్యక్షతన విజయవంతమైన జీ20 శిఖరాగ్ర సదస్సును తమ శకటంలో ప్రదర్శించింది. దీనిపై ఏర్పాటు చేసిన నమస్తే ముద్ర అందర్నీ ఆకట్టుకుంది. ఇక మరికొన్ని రోజుల్లో దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న వేళ.. కేంద్ర ఎన్నికల సంఘం ఈ పరేడ్‌లో ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటి చెప్పేలా ఒక శకటాన్ని ప్రదర్శించింది. ఈవీఎంలో ఓటు వేస్తున్నట్లుగా రూపొందించిన ఈ శకటం ప్రత్యేకంగా నిలిచిందది.
కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనం, నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రాన్ని కేంద్ర ప్రజా పనుల విభాగం తమ శకటంలో ప్రదర్శించింది. ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం జరిగి 350 ఏళ్లు పూర్తైన వేళ.. మహారాష్ట్ర తమ శకటాన్ని ప్రదర్శించింది. ఇక తెలుగు రాష్ట్రాల శకటాలు కూడా గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో ఆకట్టుకున్నాయి. అమర వీరులను స్మరించుకునేలా తెలంగాణ శకటాన్ని తీర్చిదిద్దారు. జయ జయహే తెలంగాణగా నామకరణం చేసిన ఆ శకటంలో కుమురం భీం, రాంజీ గోండు, చాకలి ఐలమ్మ వంటి పోరాట యోధుల విగ్రహాలతో పాటు రాష్ట్ర కళాకారుల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. విద్యారంగంలో చేపట్టిన సంస్కరణలకు అద్దం పట్టేలా ఆంధ్రప్రదేశ్ శకటాన్ని ప్రదర్శించారు.