కేరళలో పినరయి విజయన్ ప్రభుత్వం, గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ మధ్య కోల్డ్ వార్ పతాక స్థాయికి చేరుకుంది. గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ వ్యవహరించిన తీరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఎస్‌ఎఫ్ఐ కార్యకర్తలు తన కారుకు అడ్డం పడి.. గవర్నర్ గో బ్యాక్ అంటూ నిరసన తెలపడంతో కారు దిగి, రోడ్డుపక్కన ఒక టీ షాపు ముందు కుర్చీ వేసుకుని కూర్చున్నారు గవర్నర్. తనపై నిరసన తెలిపిన ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలను వెంటనే అరెస్టు చేయాలంటూ తన భద్రతా సిబ్బందికి హుకూం జారీ చేశారు. ‘అమిత్ షాకు ఫోన్ కొట్టు.. ప్రధానమంత్రికి ఫోన్ కలుపు’ అంటూ తన పీఏను ఆదేశించారు.
ఆందోళనకారులను పక్కకు లాగి, గవర్నర్‌ను అక్కడ నుంచి సురక్షితంగా తీసుకెళ్లేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే, ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలను అరెస్ట్ చేస్తే గానీ, అక్కడ నుంచి కదిలేదిలేదని గవర్నర్ స్పష్టం చేశారు. పోలీసులు ఎంత బతిమలాడినా వినలేదు. ‘మీరు నిరసనకారులకు భద్రత కల్పిస్తున్నారా..?’ అంటూ పోలీసులపై కోపంతో ఊగిపోయారు. ‘ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు గవర్నర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తుంటే.. వారికి ఎదురెళ్లి, నేను వెనక్కి వెళ్లను’ అని పోలీసులతో గవర్నర్ చెప్పారు. గవర్నర్ ఆరిఫ్ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కొల్లం జిల్లాలో గవర్నర్ ఓ కార్యక్రమానికి వెళ్తుండగా నీలమేల్ వద్ద అధికార సీపీఎం అనుబంధ సంస్థ ఎస్‌ఎఫ్‌ఐకు చెందిన 50 మంది కార్యకర్తలు మెరుపు ఆందోళనకు దిగారు. గవర్నర్‌కు వ్యతిరేకంగా నల్లజెండాలు ప్రదర్శించారు. గవర్నర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన గవర్నర్.. వెంటనే కారు దిగి, రోడ్డు పక్కన ఉన్న టీ దుకాణం నుంచి కుర్చీ తెప్పించుకొని రోడ్డుపక్కన వేసుకొని కూర్చున్నారు.
మరోవైపు.. గవర్నర్ ఆరిఫ్ తమను ‘బ్లడీ క్రిమినల్స్’ అంటూ పరుష పదజాలంతో దూషించారని ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు ఆరోపించారు. ‘ఎంతవరకైనా సిద్ధం. విద్యార్థులు దేనికీ కాంప్రమైజ్ కారు’ అంటూ గళం పెంచారు. కేరళలో గవర్నర్ ఆరిఫ్, ముఖ్యమంత్రి పినరయి విజయన్ మధ్య చాలాకాలంగా కోల్డ్ వార్ కొనసాగుతోంది. ప్రభుత్వం పంపించే బిల్లులను గవర్నర్ ఆమోదించకపోవడం, యూనివర్సిటీ నియామకాల్లో ప్రభుత్వ జోక్యం లాంటి అంశాలపై ఇద్దరి మధ్యా భేదాభిప్రాయాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే తాజా ఘటన చోటుచేసుకుంది. ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలను అరెస్ట్ చేసేంతవరకు తాను కదిలేది లేదని గవర్నర్ భీష్మించి కూర్చున్నారు. 17 మందిని అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పగా.. అందరినీ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
గవర్నర్ సిబ్బంది ఈ విషయాన్ని వెంటనే కేంద్ర హోం శాఖకు చేరవేశారు. ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు గవర్నర్‌పై దాడి చేయడానికి యత్నించారని సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో గవర్నర్ భద్రతను కేంద్ర హోంశాఖ ఆగమేఘాల మీద పెంచింది. గవర్నర్‌కు కేంద్ర హోం శాఖ జడ్ ప్లస్ కేటగిరీ కేటాయించినట్లు కేరళ రాజ్‌భవన్ వెల్లడించింది. ఈ అంశం కేరళలో రాజకీయంగా వేడి పుట్టించగా.. కేరళ విద్యా మంత్రి వి. శివన్‌కుట్టి సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టు చేశారు. ‘రోడ్డుపై హీట్ (వేడి)ను బీట్ చేయడానికి లైమ్ సోడా ఉత్తమ మార్గం’ అని ఆయన రాశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa