ఈ దుష్టచతుష్టయం పద్మవ్యూహంలో చిక్కుకుపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు.. అర్జునుడు.. పెత్తందారులపై ఈ కురుక్షేత్ర యుద్ధానికి నేను సిద్ధం.. మీరంతా సిద్ధమా...?’’ అంటూ భీమిలి వేదికగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి 2024 ఎన్నికల శంఖం పూరించారు. సిద్ధం సభలో ప్రసంగాన్ని ఆయన ట్వీట్ చేశారు. అబద్ధానికి, నిజానికి.. మోసానికి, విశ్వసనీయతకు మధ్య జరుగుతున్న ఈ కురుక్షేత్ర సంగ్రామంలో ఇక్కడున్నది అభిమన్యుడు కాదు.. అర్జునుడని సీఎం జగన్ స్పష్టం చేశారు. పొత్తులు, జిత్తుల పద్మవ్యూహాలతో చంద్రబాబు నేతృత్వంలోని కౌరవ సైన్యాన్ని ఎదుర్కొనేందుకు ప్రజల ఆశీస్సులు, దేవుడి దయ వంటి కృష్ణుడి ఆశీస్సులతో మీ బిడ్డ జగన్ సిద్ధంగా ఉన్నాడని ప్రకటించారు. 2024 జైత్ర యాత్రకు భీమిలి నుంచే శంఖం పూరిస్తున్నామని చెప్పారు. భీమిలి నియోజకవర్గం తగరపువలస జంక్షన్ వద్ద శనివారం ‘సిద్ధం’ పేరుతో ఏర్పాటు చేసిన ఉత్తరాంధ్ర వైఎస్సార్ కుటుంబ సమావేశానికి సీఎం హాజరయ్యారు.