వైయస్ఆర్ ఆసరాతో..మగువల జీవితాలలో వెలుగులు నిండాయని మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ అన్నారు. ఇవాళ పలు చోట్ల వైయస్ఆర్ ఆసరా నాలుగో విడత కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలకు మంత్రులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీకాకుళం నగర పాలక సంస్థ పరిధిలోని బలగ ప్రధాన మంచినీటి సరఫరా కేంద్రం వద్ద రూ.4 కోట్లతో నిర్మించిన 5 ఎంఎల్డి ఇన్ ఫిల్ట్రేషన్ గ్యాలరీ,కలెక్షన్ వెల్,పంప్ హౌస్,వాటర్ వర్క్స్ అభివృద్ధి పనులు రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. అనంతరం నగర పాలక సంస్థ పరిధిలో బలగ వద్ద ఏర్పాటు చేసిన సభలో, అలానే గార ఎంపీడీఓ కార్యాలయం ప్రాంగణాన ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. ఈ రెండు చోట్లా ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి మంత్రి ధర్మాన ముఖ్య అతిథిగా విచ్చేశారు. చీపురుపల్లి నియోజకవర్గంలో వై.యస్.ఆర్ ఆసరా 4 విడత చెక్కులను మంత్రి బొత్స సత్యనారాయణ పంపిణీ చేశారు.