గ్రామాల్లో మన కార్యకర్తలు ప్రజాధనం మింగేశారని ప్రజలెవరూ అనడంలేదు. పథకాలు అందలేదని, వివక్ష చూపారని, ధనబలం, కండబలం, కుల బలం చూశారని ఎవ్వరూ అనడంలేదు. మనం నిజాయితీగా పని చేయడం వల్ల దక్కిన గౌరవం ఇది అని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. అయన మాట్లాడుతూ.... జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు అన్నీ పంచుతున్నాడు, ఇస్తున్నాడు అని అంటున్నారు గానీ, ఒక్కరు కూడా జగన్ తినేస్తున్నాడు అని అనడంలేదని ఒక మహిళ నాతో అన్నది. ఇదీ ఒక సాధారణ మహిళ సూక్ష్మ పరిశీలన. ఇదీ మన నాయకుడికి ఉన్న గుడ్‌విల్. ప్రజాస్వామ్యంలో యుద్ధాన్ని ఎన్నుకొనే వారు వీరులు.కొద్దిరోజుల క్రితం చంద్రబాబు ఊరూరా ప్రచారం చేస్తూ విద్యుత్ ఛార్జీలు పెంచారని, ఓటు వేయొద్దని చెబుతున్నారు. విద్యుత్ ధరలు తగ్గిస్తానని మాత్రం చంద్రబాబు చెప్పడంలేదు. దేశంలో ఏ రాష్ట్రంలో పప్పులు, ఇతర నిత్యావసరాల ధరలు తక్కువగా ఉన్నాయో చెప్పాలని టీడీపీ వారిని అడుగుతున్నాను. ఇతర రాష్ట్రాల్లో జగన్ ముఖ్యమంత్రి కాదు. ఇటువంటి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ పాలనలో పెన్షన్, ఇళ్లు, స్థలం, సంక్షేమం అందాయి. గ్రామాల్లో మనం ఉన్నంత గౌరవంగా మరే ఇతర రాజకీయ పార్టీ కార్యకర్తలూ లేరు. టీడీపీ కార్యకర్తల్లా దోచుకుని ఉంటే గ్రామాల్లో గౌరవంగా ఉండగలమా? రానున్న ఎన్నికల్లో అనేక బలాలు కలిగిన మన ప్రత్యర్థులు అనేక అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. వాటిని ప్రజలెవ్వరూ నమ్మడంలేదు. 60 శాతం ప్రజలు మన పార్టీకే ఓటు వేస్తున్నామని చెబుతున్నారు అని తెలిపారు.