అన్నవరం ఆలయ పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అన్నవరం సత్యదేవుడి దర్శనానికి వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా ఉండే విధంగా నూతన నిత్యాన్నదాన భవనం నిర్మాణంపై చర్చించారు. ప్రస్తుతం ఉన్న నిత్యాన్నదాన భవనం చాలకపోవడంతో నూతన భవనం వీలైనంత త్వరగా నిర్మించాలని నిర్ణయించారు. ప్రకాష్‌సదన్ వెనుక పార్కింగ్ ప్రదేశంలో (సత్య, రత్నగిరి కూడలి వద్ద) భవనం నిర్మించాలని ఎప్పటినుంచో ప్రణాళిక ఉంది. అయితే భక్తులకు అందుబాటులో ఉండే విధంగా రత్నగిరిపై తొలగించిన టీటీడీ భవనం ప్రదేశంలో నిర్మిస్తే బాగుంటుందని అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది.
అన్నవరం సత్యనారాయణస్వామి వారి ప్రదక్షిణ దర్శనం టికెట్టు ధరపై చర్చించారు. టికెట్టు రూ. 300 ఉండటంపై పలువురు భక్తులు ఫిర్యాదు చేశారు. అయితే రూ.200 కూడా కొనసాగిస్తున్నామని.. ప్రదక్షిణ దర్శనం టికెట్టు రూ.300 గా అమలు చేస్తున్నామని అధికారులు వివరించారు. రూ.200 టికెట్టు తీసుకునే భక్తులకు ప్రదక్షిణ అవకాశం ఉండదని తెలిపారు. అయితే రూ.200 టికెట్టు తీసుకునే భక్తులు ప్రదక్షిణ చేసుకోలేకపోయామన్న భావన ఉంటుందని.. రూ.300 అయితే భారమవుతుందని చర్చించారు. దీనిపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు.
ఆలయంలో పలు అంతర్గత రోడ్ల పనులపై సమావేశంలో చర్చ జరిగింది. ఆదిశంకర్ మార్గ్, వనదుర్గ మార్గ్, హరిహరమార్గ్, మూడో ఘాట్ రోడ్డులకు గానూ కొండను తొలచి పనులు చేపట్టడం దీనివల్ల భవిష్యత్తులో కలిగే ఇబ్బందులు, ఈ రహదారుల వల్ల పర్యావరణానికి హాని, ప్రస్తుతం ఉన్న నిర్మాణాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉండటం తదితర అంశాలతో నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చ జరిగింది. నివేదికకు అనుగుణంగా తదుపరి చర్యలు ఉంటాయన్నారు.
మరోవైపు పలు వ్యాపార హక్కుల లైసెన్స్‌లను ఆమోదించారు. శివసదన్ వసతి సముదాయంలో సూట్‌రూంల అద్దె పెంపు, ఆదిశంకర్ మార్గ్‌లో రక్షణ ఏర్పాట్లలో భాగంగా రోడ్డు పక్కన క్రాస్‌బారియర్స్ ఏర్పాటుకు టెండర్లు, ఇతర అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శంఖవరంలో దేవస్థానం దత్తత దేవాలయం ఉమామల్లేశ్వర స్వామి దేవస్థానంలో కల్యాణ మండపంలో రూ. 26 లక్షలతో అభివృద్ధి పనులకు, ఎగువ ఘాట్ రోడ్డులో రూ.40 లక్షలతో బీటీ రోడ్డు వేయడానికి, నూతన మెట్ల మార్గం అంచనాలను సమావేశంలో ఆమోదాన్ని తెలియజేశారు. అన్నవరంలో పార్కింగ్ విషయంలో ఎప్పటి నుంచో సమస్య వెంటాడుతోంది.. ఆ సమస్యకు కూడా చెక్ పెట్టాలని పాలకమండలి భావిస్తోంది.. ఆ సమస్యను పరిష్కరించాలి అనుకుంటున్నారు. ఈ అంశాన్ని ఒ కొలిక్కి తీసుకొచ్చే అవకాశం ఉంది.