ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఇకపై గదులకు ఇబ్బంది ఉండదు!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 30, 2024, 07:06 PM

టీటీడీ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.5,141.74 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను ఆమోదించినట్లు టీటీడీ పాలకమండలి ఛైర్మన్ భూమ‌న కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశంలో ముఖ్య నిర్ణ‌యాలు తీసుకున్నారు. తిరుమలలోని ఆకాశగంగ నుంచి ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు రెండు వరుసల రహదారిని నాలుగు వరుసల రహదారిగా అభివృద్ధి చేసేందుకు రూ.30.71 కోట్లతో టెండరు ఆమోదించారు. అంతేకాదు భక్తుల వసతి గదులకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు.


తిరుమల శ్రీవారి దర్శనానికి దేశవ్యాప్తంగా విచ్చేసే భక్తుల సౌకర్యార్థం రూ.2.28 కోట్లతో సప్తగిరి సత్రాలు-6, 7 బ్లాకుల అభివృద్ధి పనుల కోసం టెండరు ఆమోదించారు. తిరుమలలోని శ్రీవేంకటేశ్వర, ఆదిశేషు, శంకుమిట్ట విశ్రాంతి గృహాల అభివృద్ధి, పెయింటింగ్‌ పనుల కోసం రూ.10.90 కోట్లు మంజూరుకు పరిపాలన అనుమతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆకాశరాజు నిర్మించిన అతిప్రాచీనమైన నారాయణవనంలోని శ్రీభద్రకాళీ సమేత వీరభద్రస్వామివారి ఆలయానికి రాజగోపురం, రాతిప్రాకారం నిర్మాణానికి రూ.6.90 కోట్లు మంజూరుకు ఆమోదించారు.


టీటీడీలోని వివిధ విభాగాల‌లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానంలో ప‌నిచేసే వారికి వేత‌నాలు పెంచారు. టీటీడీ ఉద్యోగుల ఇళ్లస్థలాల కోసం వడమాలపేట మండలం పాదిరేడు అరణ్యం వద్ద అదనంగా కేటాయించిన 132.05 ఎకరాల స్థలంలో గ్రావెల్‌ రోడ్డు ఏర్పాటుకు టెండరు ఆమోదం తెలిపారు. టీటీడీ పోటు విభాగంలోని 70 మంది కాంట్రాక్టు లడ్డూ ట్రే లిఫ్టింగ్‌ సెమి స్కిల్డ్‌, అన్‌స్కిల్డ్‌ కార్మికులను స్కిల్డ్ కార్మికులుగా మార్పు చేసి వారి వేతనాలను రూ.12,523/ నుంచి రూ.15 వేలకు పెంచేందుకు ఆమోదించారు. అన్న‌దాన విభాగంలో 138 మంది క్లీన‌ర్లు, 79 మంది వంట మనుషులను స్కిల్డ్ కేట‌గిరీలోకి మార్చి వారి వేత‌నాలను రూ.17 వేల నుంచి రూ.22 వేల‌కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.


ఎల‌క్ట్రిక‌ల్, వాట‌ర్ వ‌ర్క్స్ విభాగాల్లో ప‌నిచేసే కార్మికుల‌ను అన్‌స్కిల్డ్ నుండి స్కిల్డ్ కేటగిరీలోకి మార్చారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర శిల్ప క‌ళాశాల‌లో వివిధ దేవ‌తామూర్తుల శిల్పాల‌ను త‌యారుచేస్తున్న శిల్పుల క‌ళానైపుణ్యాన్ని ప్రోత్స‌హించ‌డంలో భాగంగా, వారి వేత‌నాల పెంపుద‌ల‌కు ఆమోదించారు. క‌లంకారి క‌ళ‌లో నిపుణులైన శ్రీ మున‌స్వామిరెడ్డి వేత‌నం రూ.25 వేల నుంచి రూ.39 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ అనుబంధ‌, విలీన ఆల‌యాల్లో విధులు నిర్వ‌హిస్తున్న కాంట్రాక్టు అర్చ‌కులు, సంభావ‌న అర్చ‌కుల వేత‌నాల‌ను రూ.26 వేల నుంచి రూ.31 వేల‌కు పెంచేందుకు ఆమోదించారు. టీటీడీ స్టోర్‌లో ప‌నిచేసే 9 మంది వ‌ర్క‌ర్ల‌కు వారి వేత‌నం రూ.9 వేల నుంచి రూ.15 వేల‌కు పెంచారు.


ఎస్వీ ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ద్వారా సేవ‌లందిస్తున్న క్ర‌మాపాఠీల‌కు రూ.16 వేల నుంచి రూ.22 వేల‌కు, ఘ‌నాపాఠీల‌కు రూ.17 వేల నుండి రూ.25 వేల‌కు సంభావ‌న‌ పెంచారు. అదేవిధంగా, 1400 మంది వేద‌పారాయణదారుల‌కు ప్ర‌స్తుతం ఇస్తున్న పెన్ష‌న్ రూ.10 వేల నుంచి రూ.12 వేల‌కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. హైందవ సనాతన ధర్మప్రచారంలో భాగంగా వేదవిద్యను వ్యాప్తి చేసేందుకు టీటీడీ ఆధ్వర్యంలో ఆరు వేద పాఠశాలలు నడుస్తున్నాయి. ఈ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న 51 మంది సంభావన అధ్యాపకుల వేతనాలను రూ.35 వేల నుంచి రూ.54 వేలకు పెంచేందుకు ఆమోదం తెలిపారు.


టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న 26 స్థానికాలయాలు, విలీనం చేసుకున్న 34 ఆలయాల్లో భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగినంత సిబ్బందితో ఆలయ కైంకర్యాలు తదితర సేవలు నిర్వహించేందుకు నూతన పోస్టులు సృష్టించేందుకు ప్రభుత్వ ఆమోదానికి పంపేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా టీటీడీ అనుబంధ ఆలయాల్లో 227 వేదపారాయణందారు, అధ్యాపక, మేళం సిబ్బంది పోస్టులు, టీటీడీ విలీనం చేసుకున్న ఆలయాల్లో 288 అర్చక, పరిచారిక, పోటు వర్కర్‌, ప్రసాదం డిస్ట్రిబ్యూటర్‌, వేదపారాయణందారు, మేళం సిబ్బంది పోస్టులు ఉన్నాయి.


రాష్ట్ర విభజన అనంతరం, ఆంధ్రప్రదేశ్‌లో చిన్నపిల్లలకు ప్రత్యేకించి వైద్యసేవలు అందించాలన్న ముఖ్యమంత్రివర్యులు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సూచనల మేరకు తిరుపతి నగరంలో శ్రీవారి పాదాల చెంత శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. భారతదేశంలోనే చిన్నారులకు సంబంధించి ప్రత్యేక సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిగా ఆవిర్భవించనున్న ఈ ఆసుపత్రిని ఇకపై శ్రీ పద్మావతి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ చైల్డ్‌ హెల్త్‌గా వ్యవహరిస్తారన్నారు. టీటీడీ పాలనా వ్యవహారాలు మరింత వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు గాను సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఐదేళ్ల కాలపరిమితికి గాను ఓరాకిల్‌ ఫ్యూజన్‌ క్లౌడ్‌ ఇఆర్‌పి ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనం సమావేశ మందిరం ఆధునీకరణలో భాగంగా దృశ్యశ్రవణ అనుసంధాన పరికరాల ఏర్పాటుకు ఆమోదించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com