దేశీయ వ్యాపార, పారిశ్రామిక రంగంలో ప్రముఖులు ఎందరో ఉన్నారు. తమ వ్యాపార సామ్రాజ్యాలను అన్ని రంగాల్లో విస్తరిస్తూ దూసుకెళ్తుంటారు. అయితే, అలాంటి వారి ప్రభావం స్టాక్ మార్కెట్లపై ఎక్కువగా ఉంటుంది. వారు తీసుకునే నిర్ణయాలు ప్రభావం చూపిస్తుంటాయి. అంతే కాదు అలాంటి వారిపై ఏవైనా ఆరోపణలు వచ్చినప్పుడు వారి కంపెనీల షేర్లతో పాటు స్టాక్ మార్కెట్ సూచీలు కుప్పకూలుతుంటాయి. దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇలాంటి సందర్భాలు చాలా సార్లు ఎదురయ్యాయి. కొన్ని సందర్భాల్లో మార్కెట్లు వేగంగా కోలుకున్నప్పటికీ మరి కొన్ని సందర్భాల్లో మాత్రం చాలా సమయం పట్టిందని చెప్పవచ్చు.
ఇటీవలి కాలంలో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. 2023 జనవరిలో హిండెన్‌బర్గ్ నివేదిక సంచలను సృష్టించిన సంగతి తెలిసింది. దీంతో అప్పుడు అదానీ గ్రూప్ షేర్లు భారీగా పడ్డాయి. దీంతో మార్కెట్లూ తీవ్రంగా నష్టోయాయి. ఇప్పుడు మళ్లీ సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల కోసం రూ.2,200 కోట్లు లంచాలు ఇచ్చారంటూ అమెరికాలో కేసు నమోదవడం సంచలనంగా మారింది. దీంతో అదానీ గ్రూప్ కంపెనీల విలువ రూ.219 లక్షల కోట్లు కోసుకుపోయింది. దీంతో మార్కెట్ ఇన్వెస్టర్ల సంపద రూ.5 లక్షల కోట్లు పడిపోయింది. మరి ఇలాంటి ఉదాంతాలు గతంలోనూ జరిగాయి. వాటి గురించి ఓసారి తెలుసుకుందాం.
హర్షద్ మెహతా
బాంబే స్టాక్ ఎక్స్చేంజీ సెక్యూరిటీల స్కామ్ ద్వారా రూ.5 వేల కోట్ల మోసానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. 1992లో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దీంతో స్టాక్ మార్కెట్లు 72 శాతం పడిపోయాయి. ఈ ప్రభావం రెండేళ్ల పాటు కొనసాగింది.
సీఆర్ భన్సాలీ
దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను రూ.57 కోట్లకు మోసం చేశారని 1997లో సీఆర్బీ క్యాప్స్ ఛైర్మన్ అయిన రూప్ భన్సాలిపై సీబీఐ కేసు పెట్టింది. బ్యాంకు నుంచి ఇతర మార్గాలకు నిధులు మళ్లించారని ఆరోపణలు వచ్చాయి.
కేతన్ పరేఖ్
1999 నుంచి 2001 మధ్య కాలంలో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయను 2017 వరకు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో పాల్గొనకుండా సెబీ నిషేధం విధించింది.
సత్యం రామలింగరాజు
సత్యం కంప్యూటర్స్ కుంభకోణం 2009 సమయంలో సంచలనంగా మారింది. దేశంలో అతిపెద్ద అకౌంటింగ్ స్కామ్‌గా చెప్తారు. కంపెనీని లాభాదాయకంగా చూపిస్తూ రూ.7,136 కోట్ల మేర మోసానికి పాల్పడినట్లు బోర్డుకు, స్టాక్ ఎక్స్చేంజీలకు రామలింగరాజు లేఖ రాసిన క్రమంలో 2009, జనవరిలో వెలుగులోకి వచ్చింది. 2015లో ఆయనకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు.
సుబ్రతారాయ్
ఇన్వెస్టర్లకు రూ.17,400 కోట్ల మేర డబ్బులు రిఫండ్ చేయాలంటూ 2012లో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ ఆదేశాలను ఉల్లఘించినందుకు గానూ 2014లో ఆయనను అరెస్ట్ చేశారు.
జిగ్నేశ్ షా
నేషనల్ స్పాట్ ఎక్స్చేంజీ లిమిటెడ్ స్థాపించి రూ.5,600 కోట్ల కుంభకోణానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. 13 వేల మంది ఇన్వెస్టర్లకు రిఫండ్ చేయడంలో విఫలమైన క్రమంలో ఈడీ ఆయన్ను అరెస్ట్ చేసింది.
విజయ్ మాల్యా
17 బ్యాంకుల కన్సార్టియంకు ఏకంగా రూ.9 వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టారని విజయ్ మాల్యాపై కేసులు నడుస్తున్నాయి. 2016, మార్చి 2వ తేదీన ఆయన భారత్ నుంచి లండన్ పారిపోయారు. ఇప్పటికీ ఈ కేసులు నడుస్తున్నాయి.