త్వరలో ఎన్నికల జరగనున్న నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కాగా.. ఏపీ రాజకీయాలపై తెలంగాణ నేతలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. మొన్నటివరకు.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో తెలంగాణలో విస్తృతంగా పాదయాత్ర చేసి.. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిన వైఎస్ షర్మిల.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఏపీపీసీసీగా బాధ్యతలు స్వీకరించి.. తన అన్న వైఎస్ జగన్‌పై ఘాటు విమర్శలు చేస్తూ.. రాజకీయాన్ని రసవత్తరంగా మార్చేశారు. ఈ క్రమంలోనే.. వైఎస్సార్ కుటుంబంతో సత్సంబంధాలు ఉన్న తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఇప్పుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన సమయంలో.. తెలంగాణ వైఎసీపీ తరుపున జగన్ తరపున విస్తృత ప్రచారం నిర్వహించిన సురేఖ.. ఇప్పుడు ఏపీకి వెళ్లి ఆయనకు వ్యతిరేఖంగా ప్రచారం చేసేందుకు సిద్ధం అంటున్నారు.
ఏపీలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయని.. ఆ ఎన్నికల ప్రచారానికి తాను వెళ్తానని కొండా సురేఖ తెలిపారు. కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తానని చెప్పుకొచ్చారు. ఏపీ ఎన్నికల షెడ్యూల్ రాగానే తప్పకుండా వెళ్తానన్నారు. తాను ఇప్పుడు వైసీపీలో లేనన్న విషయాన్ని సురేఖ గుర్తు చేశారు. ఏపీలో కూడా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు సురేఖ. ఇప్పటికే.. కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన వైఎస్ షర్మిల.. తన అన్నపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీకి బానిసలుగా మారారంటూ రాజకీయంగా విమర్శలు చేయటమే కాకుండా.. ఆస్తిలో తనకూ వాటా ఉందంటూ కామెంట్లు కూడా చేస్తూ.. రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెర తీశారు. ఇలాంటి సమయంలో.. షర్మిలకు తోడుగా నేనున్నానంటూ కొండా సురేఖ కూడా వస్తానని ప్రకటించటం.. ఆమెకు కొంత బలాన్ని చేకూర్చినట్టే అంటున్నారు ఏపీ కాంగ్రెస్ నేతలు.
వైఎస్ రాజశేఖర్ హయంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన కొండా సురేఖ.. వారి కుటుంబానికి సన్నిహితులుగా మెలిగారు. వైఎస్సార్ మరణం తర్వాత.. జగన్ వెంట నిలబడటంతో కొండా దంపతులకు తెలంగాణలో సరైన ఆదరణ లభించలేదు. సుమారు పదేళ్ల పాటు రాజకీయ అస్థిరత తర్వాత.. మళ్లీ కాంగ్రెస్‌లో చేరి గెలిచి మంత్రి అయ్యారు. అయితే.. దీనంతటికీ కారణం జగనే అని భావిస్తున్న కొండా దంపతులు.. ఇప్పుడు వైఎస్సార్ కుటుంబం రెండు పార్టీలుగా విడిపోవటంతో.. షర్మిలకే సపోర్ట్‌గా నిలబడుతామని ప్రకటించటం.. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.