ప్రొద్దుటూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్యవర్తి దగ్గర రూ.50 కోట్లు ఉంచి వచ్చే ఎన్నికల్లో పంచడానికి సిద్ధమా? అని టీడీపీ నేతలకు ఆయన సవాల్ విసిరారు. డబ్బులిచ్చి ఓట్లు వేయించుకోవడం తప్పో ఒప్పో తనకు తెలియడం లేదన్నారు. తాను సంపాదించే డబ్బుకు తన బిడ్డలు వారసులు కాదని.. తన ఊరు ప్రజలే వారసులని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తాను సంపాదించే డబ్బును అధిక మొత్తంలో ప్రజల కోసమే ఖర్చు చేస్తానన్నారు.
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి ముందే.. చెరో రూ.50 కోట్లు తెచ్చి ప్రజలందరికీ పంచి పెడదామంటే.. నా ఆస్తులు తనఖా పెట్టయినా డబ్బు తెస్తాను. రూ.50 కోట్లు సరిపోదంటే.. నా ఆస్తులు మొత్తం విక్రయిస్తే రూ.100 కోట్లు వస్తే.. ఆ మొత్తాన్ని మధ్యవర్తికి ఇస్తాను. ఇలా ఇవ్వడానికి టీడీపీ నేత సిద్ధమా? అని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సవాల్ విసిరారు. డైమండ్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌గా పేరుగాంచిన ప్రొద్దుటూరులో ఈసారి పోటీ హోరాహోరీగా ఉండే అవకాశం ఉంది. వరుసగా రెండుసార్లు గెలిచిన రాచమల్లు హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఈసారి టీడీపీ కూడా ఇక్కడ బలంగా పుంజుకుంది. కానీ గ్రూపు రాజకీయాలు టీడీపీకి తలనొప్పిగా మారాయి. టీడీపీ టికెట్ ఆశించేవారి సంఖ్య ఎక్కువగా ఉంది. టీడీపీ తరఫున ఈసారి జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి, వరదరాజులు రెడ్డిల్లో ఒకరు పోటీ చేసే అవకాశం ఉంది.
‘నా వల్ల మేలు జరిగిందనుకుంటేనే.. నాకు ఓటేయండి. లేదంటే నాకు ఒక్క ఓటు కూడా వేయొద్దు. మాత్రం డబ్బు తీసుకొని ఓటు వేయొద్దు.. మీకు, మీ పిల్లలకు భవిష్యత్తు ఇచ్చే పార్టీకి, నాయకుడికే ఓటు వేయండి’ అని గత ఏడాది జనవరిలోనే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాను కూడా తమ నాయకుడు జగన్‌లాగే మాట్లాడుతానన్నారు.
ఇటీవల కడప జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్‌ను కలిసిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే.. తన ఫోన్‌ను హ్యాక్ చేశారంటూ ఫిర్యాదు చేయడం సంచలనమైంది. రాజకీయంగా వైఎస్సార్సీపీ టీడీపీ ఎదుర్కోలేకపోతోందని.. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులను ఓడించడానికి లేదా భౌతికంగా తుది ముట్టించడానికి కుట్రలు జరుగుతున్నాయనడానికి ప్రొద్దుటూరులో జరుగుతోన్న కుట్రలే నిదర్శనమన్నారు. తన ఫోన్ హ్యాక్ చేయాలని ఆస్ట్రేలియాలో ఉండే ఓ హ్యాకింగ్ సంస్థతో రూ.50 లక్షలతో డీల్ కుదుర్చుకున్నారని ఆయన ఆరోపించారు. అందులో 25 శాతం మొత్తాన్ని కూడా చెల్లించారని ఆయన తెలిపారు. తన ఫోన్ కాల్స్, ఛాటింగ్, ఫొటోలు, వాట్సాప్ కాల్స్.. ఇలా అన్ని వివరాలను సేకరించేందుకు టీడీపీ నేతలు కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు. తనను భౌతికంగా తుదముట్టించాలనా.. రాజకీయంగా తుదముట్టించాలనా..? అని ఆయన ప్రశ్నించారు.