ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చైనా సైనికులను ధైర్యంగా ఎదిరించిన లడఖ్ గొర్రెల కాపర్లు

national |  Suryaa Desk  | Published : Wed, Jan 31, 2024, 09:40 PM

వాస్తవాధీన రేఖ దగ్గర గొర్రెలను మేపకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించిన చైనా సైనికులను లడఖ్ గొర్రెల కాపరుల బృందం ధైర్యంగా ఎదుర్కొంది. జూన్ 2020 నాటి గాల్వాన్ ఘర్షణ తర్వాత స్థానిక గొర్రెల కాపరులు ఈ ప్రాంతంలో పెంపుడు జంతువులను మేపడం మానేశారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దళాలతో వాదిస్తూ, తాము భారత భూభాగంలో ఉన్నామని చెబుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. గత మూడేళ్లుగా తూర్పు లడఖ్‌లోని కాపరులు ఎల్ఏఎస్ వద్ద పలు ప్రాంతాలకు తమ పశువులను మేతకు తీసుకెళ్లడం లేదు.


ఎల్ఏసీ అనేది భారత్, చైనా భూభాగాలను వేరుచేసే ఒక సరిహద్దు రేఖ. కానీ సరిహద్దు విషయంలో ఇరు దేశాల మధ్య భిన్నాప్రాయలు ఉండటం.. కొన్ని సందర్భాల్లో ఘర్షణలకు దారి తీస్తోంది. చైనా సైనికులు ధీటుగా బదులిచ్చిన స్థానిక గొర్రెల కాపర్ల ధైర్యాన్ని, భారత సైన్యం మద్దతును ప్రశంసిస్తూ చూషుల్ కౌన్సిలర్ కొంచోక్ స్టాంజిన్ ట్విట్టర్‌లో వీడియోను షేర్ చేశారు. తూర్పు లడఖ్‌ సరిహద్దు ప్రాంతాల్లో.. పాంగాంగ్ నదికి ఉత్తర ఒడ్డున ఉన్న సంప్రదాయ పచ్చిక మైదానాల్లో పశువులను మేపుకునే విషయంలో సంచార జాతులకు భారత సైన్యానికి చెందిన ఫైర్ ఫ్యూరీ కార్ప్స్ అండగా నిలిచింది. పౌరులతో బలమైన సంబంధాలను నెరుపుతూ.. సరిహద్దు ప్రాంత ప్రజల ప్రయోజనాలను పరిరక్షించినందుకు భారత సైన్యానికి ధన్యవాదాలు’ అని చుషుల్ కౌన్సిలర్ కొంచోక్ స్టాంజిన్ ట్వీట్ చేశారు. జనవరి ప్రారంభంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కూడా ఆయన షేర్ చేశారు.


ఇది మా ప్రాంతం అని స్థానిక ప్రజలు చైనా సైనికులతో ధైర్యంగా ఎలా మాట్లాడుతున్నారో చూడండి.. భారత భూభాగంలో మన దేశానికి చెందిన సంచార జాతుల ప్రజలు పశువులను మేపకుండా పీఎల్ఏ అడ్డుకుంటోంది. సరిహద్దు వివాదం ఎప్పటికీ కొలిక్కి వస్తుందో చెప్పలేం. కానీ మన భూభాగాన్ని ఎల్లవేళలా రక్షించడానికి.. సైన్యం తర్వాత దేశానికి రెండో సంరక్షక శక్తిగా నిలుస్తోన్న సంచార జాతులకు నేను వందనం చేస్తున్నాను’ అని స్టాంజిన్ రాసుకొచ్చారు. చైనా సైన్యానికి చెందిన మూడు వాహనాలతోపాటు, అనేక మంది సైనికులు అక్కడ ఉండటం వీడియోలో కనిపిస్తోంది. చైనా సైన్యానికి చెందిన వాహనాలు అలారం మోగిస్తూ గొర్రెల కాపరులను వెళ్లిపోవాలని హెచ్చరిస్తున్నాయి. కానీ వారు అక్కడే నిలబడి పీఎల్ఏ దళాలతో వాదించడం.. తాము భారత భూభాగంలోనే మేపుతున్నామని నిశ్చయంగా చెప్పడం.. ఒకట్రెండు సందర్భాలలో వాగ్వాదం ముదిరినప్పుడు కొందరు గొర్రెల కాపరులు హెచ్చరికగా రాళ్లు తీయడం వీడియోలో కనిపిస్తోంది. కానీ హింస చెలరేగినట్లు వీడియోలో కనిపించలేదు. వీడియోలో కనిపిస్తున్న చైనా సైనికుల వద్ద ఆయుధాలు లేవు.


భారత సైనికుల మద్దతు కారణంగా మన గొర్రెల కాపరులు చైనా దళాలను ధైర్యంగా ఎదుర్కోగలిగారని చుషుల్ కౌన్సిలర్ తెలిపారు. ‘గొర్రెల కాపరులకు చైనా సైనికులు సమస్యలు కలగజేసినప్పుడు.. మన బలగాలు ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.. లడఖ్‌ సంచార జాతుల ప్రజలు.. చైనా సైనికులను ధైర్యంగా ఎదుర్కోగలిగారు’ అని ఆయన పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com