పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. కొత్త భవనంలో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మొదటిసారి ప్రసంగించారు. ఈ సందర్భంగా ముర్ము.. కొత్త పార్లమెంట్‌లో ఇదే తన తొలి ప్రసంగం అని చెప్పారు. సభా కార్యకలాపాలు సజావు సాగేందుకు సహకరించాలని విపక్ష పార్టీలను రాష్ట్రపతి ముర్ము కోరారు. 21వ శతాబ్ధంలో నవ భారతం సరికొత్త సంప్రదాయాలను నిర్మించాలనే సంకల్పానికి ఈ భవనం ప్రతీకగా ఉంది. ఈ నూతన పార్లమెంట్ భవనంలో విధవిధానాలపై అర్థవంతమైన చర్చలు జరుగుతాయని నేను విశ్వసిస్తున్నానని ఆమె అన్నారు.
భారతీయ సంస్కృతి, సభ్యత ఎంతో చైతన్యవంతమైనవని, చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలిదేశం భారత్ అని రాష్ట్రపతి కొనియాడారు. ఆసియా క్రీడల్లో తొలిసారి వంద పతకాలను భారతీయ క్రీడాకారులు సాధించారని పేర్కొన్నారు. గతంలో గరీబ్ హఠావో నినాదాన్ని మాత్రమే విన్నామని, ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నామని ముర్ము అన్నారు. ‘శాంతినికేతన్ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది.. భగవాన్ బిర్సా ముండా జన్మదినాన్ని జన్ జాతీయ దివస్‌గా జరుపుకొంటున్నాం.. తెలంగాణలో సమ్మక్క-సారక్క గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుంది.. ఆదివాసీ యోధులను స్మరించుకోవడం గర్వకారణం.. గతేడాది మన దేశం ఎన్నో ఘనతలు సాధించింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది.. ఆదిత్య ఎల్-1 మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించింది. జీ20 సమావేశాలను విజయవంతంగా నిర్వహించుకున్నాం... ఆసియా క్రీడల్లో తొలిసారి భారత్ 107, పారా క్రీడల్లో 111 పతకాలు సాధించింది’ అని తెలిపారు.
కశ్మీర్‌లో ఆర్టికల్ 370ను ఎత్తివేయడం చారిత్రాత్మక నిర్ణయమని ముర్ము ప్రశంసించారు. *పేదల కోసం 10 కోట్ల ఉజ్వల్ కనెక్షన్ల అందజేశాం.. తొలిసారిగా నమోభారత్ రైలును ఆవిష్కరించాం.. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేలా నారీశక్తి వందన్ అధినియమ్ బిల్లును ఆమోదింపజేసుకున్నాం.. ‘గరీబీ హఠావో’ నినాదాన్ని వింటున్నాం.. కానీ, జీవితంలో తొలిసారి పేదరికాన్ని పెద్ద ఎత్తున పారదోలడం చూస్తున్నాం. గత 10 ఏళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా భారత్ ముందుకెళ్తోంది.’ అని మోదీ ప్రభుత్వాన్ని రాష్ట్రపతి అభినందించారు.
‘శతాబ్దాలుగా కలలు కంటున్న అయోధ్యలో రామమందిర నిర్మాణం సాకారమైంది.. ఎన్నో ఆటంకాలను అధిగమించి ఆలయాన్ని ప్రారంభించాం.. దేశంలో 5జీ నెట్‌వర్క్ వేగంగా విస్తరిస్తోంది.. కొత్త క్రిమినల్ చట్టాలను తీసుకొచ్చాం. ‘ఏక్ భారత్- శ్రేష్ఠ్ భారత్’ నినాదంతో ముందుకెళ్తున్నాం.. రక్షణ, అంతరిక్ష రంగంలో కొత్త ఆవిష్కరణలు జరిగాయి.. ఉత్తర్ ప్రదేశ్, తమిళనాడులో రక్షణ కారిడార్‌లు ఏర్పాటుచేసుకున్నాం..... ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాంకింగ్ వ్యవస్థల్లో భారత్ ఒకటిగా నిలిచింది.’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa