మణిపూర్ నుంచి ముంబై వరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కొనసాగిస్తున్న భారత్ జోడో న్యాయ్ యాత్రలో మరోసారి భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్‌లోకి చేరుకున్న రాహుల్ యాత్రలో గుర్తు తెలియని వ్యక్తులు బీభత్సం సృష్టించారు. రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న కారుపై దాడికి దిగారు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న కారు అద్దాలు పగులగొట్టారు.
భారత్ జోడో న్యాయ్ యాత్ర షెడ్యూల్‌లో భాగంగా ఇవాళ మధ్యాహ్నం పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాకు చేరుకుంది. ఈ క్రమంలోనే అక్కడ భద్రతా లోపం తలెత్తింది. అక్కడ నిర్వహించిన ర్యాలీలో కొందరు దుండుగులు రెచ్చిపోయారు. రాహుల్ గాంధీ కారుపై వెనక నుంచి రాళ్లతో దాడికి తెగబడ్డారు. ఈ క్రమంలోనే అక్కడ ఉన్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే రాహుల్ గాంధీ సెక్యూరిటీ సిబ్బంది తేరుకునే లోపే ఈ దాడి జరిగిందని ప్రత్యక్ష సాక్ష్యులు వెల్లడించారు.
ఈ దాడిలో రాహుల్ గాంధీ వెళ్తున్న కారు కొంత ధ్వంసం అయింది. కారు వెనుక ఉన్న అద్దం పూర్తిగా పగిలిపోయింది. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా చోటు చేసుకున్న రాళ్ల దాడి తర్వాత రాహుల్ గాంధీతో పాటు పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి కూడా ఆ కారు నుంచి కిందకి దిగారు. అయితే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తాము ప్రయాణిస్తున్న కారుపై వెనుక నుంచి రాళ్లతో దాడి చేసినట్లు అధిర్ రంజన్ చౌదరి తెలిపారు.
యాత్రలో కారుపై రాళ్ల దాడి తర్వాత రాహుల్ గాంధీ కారులోంచి దిగి బస్సులోకి ఎక్కారు. ఇక అక్కడ ఉన్న వారిని కాంగ్రెస్ కార్యకర్తలు శాంతింప జేశారు. ఈ దాడిలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. అనంతరం తిరిగి ప్రారంభమైన భారత్ జోడో న్యాయ్ యాత్ర.. పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతుంది. అయితే రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభం అయిననప్పటి నుంచీ ఇలాంటి ఘటనలు, వరుసగా భద్రతా లోపాలు తలెత్తడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.