బీహార్‌లో కూటమిని మార్చి.. తిరిగి అధికారంలోకి వచ్చిన జేడీయూ అధినేత నితీశ్ కుమార్.. ఇండియా కూటమిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మహాఘట్ బంధన్‌కు గుడ్ బై చెప్పి.. బీజేపీ మద్దతుతో మళ్లీ సీఎం అయిన నితీశ్ కుమార్.. తాజాగా కాంగ్రెస్, ఇండియా కూటమి పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే అసలు ప్రతిపక్షాలు అన్నీ కలిసి ఏర్పాటు చేసిన కూటమికి ఇండియా అనే పేరు పెట్టడం తనకు ఇష్టం లేదని మనసులో మాటను బయటికి చెప్పేశారు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీలే లక్ష్యంగా సంచలన ఆరోపణలు చేశారు.
విపక్ష కూటమికి ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇంక్లూజివ్ అలయెన్స్-ఇండియా అనే పేరు పెట్టవద్దని కాంగ్రెస్‌కు, ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలకు తాను చెప్పానని నితీశ్ కుమార్ తాజాగా మీడియాకు వెల్లడించారు. అయినప్పటికీ వారు అదే పేరును ఖరారు చేశారని చెప్పుకొచ్చారు. తాను ఆ పేరు వద్దని ఎంత ప్రయత్నించినా వారు వినలేదని తెలిపారు. ఇక దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ.. ఏ రాష్ట్రంలో ఏ సీట్లలో ఏ పార్టీ పోటీ చేయాలి అనే దానిపై ఇంకా తేల్చకపోవడంతోనే తాను ఇండియా కూటమి నుంచి బయటికి వచ్చి ఎన్డీఏలో చేరాల్సి వచ్చిందని.. తాను తీసుకున్న నిర్ణయాన్ని నితీశ్ కుమార్ సమర్థించుకున్నారు. ఇప్పటికి కూడా దేశంలో ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందనే నిర్ణయానికి కూటమి నేతలు రాలేదని విమర్శలు చేశారు. అందుకే కూటమి నుంచి బయటికి రావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అయితే ఇండియా కూటమి ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన నితీశ్ కుమార్.. ప్రతిపక్ష కూటమి నుంచి అధికార పక్షంలోకి వెళ్లడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అయితే బీజేపీతో కలవడంపైనా నితీశ్ కుమార్ తనదైన శైలిలో సమాధానాన్ని ఇచ్చారు. తాను ఇంతకుముందు ఎవరితో పనిచేశానో తిరిగి వారితోనే కలిసానని చెప్పారు. బీహార్ ప్రజల కోసం తాను పనిచేస్తూనే ఉంటానని నితీష్ కుమార్ తెలిపారు. ఇక ఈ సందర్భంగానే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. బీహార్‌లో విజయవంతంగా నిర్వహించిన కుల గణనకు సంబంధించిన క్రెడిట్‌ను దక్కించుకోవాలని రాహుల్ గాంధీ ప్రయత్నించారని నితీష్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. కులగణన ఎప్పుడు జరిగిందో రాహుల్ మరిచిపోయారా అని నితీశ్ కుమార్ ప్రశ్నించారు. 9 పార్టీల సమక్షంలోనే తాను బీహార్‌లో కులగణన చేపట్టానని.. 2019 నుంచి 2020 మధ్య అసెంబ్లీలో, బయట, బహిరంగ సభల్లో ప్రతి చోట కులగణన అంశంపై తాను మాట్లాడానని.. అయితే ఆ ఘనతను దక్కించుకోవాలని రాహుల్ గాంధీ చూశారని నితీష్ కుమార్ ఆరోపించారు.