విశాఖ జిల్లా మధురవాడలో జరిగిన ఎమ్మార్వో రమణయ్య హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎమ్మార్వో హత్య కేసులో నిందితుణ్ని గుర్తించినట్లు వైజాగ్ పోలీసులు ప్రకటించారు. రియల్ ఎస్టేట్ అంశాలే ఎమ్మార్వో రమణయ్య హత్యకు దారితీసినట్లు వెల్లడించారు. కేసుకు సంబంధించిన విషయాలను ఈ మేరకు వైజాగ్ సీపీ రవిశంకర్ వెల్లడించారు.
" ఎమ్మార్వో రమణయ్య ఇంటి ముందు ఇద్దరితో మాట్లాడుతుండగా దుండగుడు రాడ్‌తో దాడిచేశాడు. రాత్రి పదిగంటల సమయంలో ఈ ఘటన జరిగింది. దాడి జరిగిన విషయమై వెంటనే మాకు సమాచారం వచ్చింది. సమాచారం రాగానే ఘటనాస్థలికి చేరుకున్నాం . సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాం. ఎమ్మార్వో ఆఫీసు సిబ్బందిని విచారించాం. అప్పటివరకూ సేకరించిన ఆధారాల నిందితుడిని గుర్తించాం. ఎమ్మార్వో సనపాల రమణయ్యకు, నిందితుడికి రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. దీనికి సంబంధించి నిందితుడు ఎమ్మార్వో ఆఫీసుకు కూడా వెళ్లినట్లు గుర్తించాం. సీసీటీవీ ఫుటేజీ కూడా దొరికింది. ఘటన తర్వాత నిందితుడు ఎయిర్ పోర్టు వైపు వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజిలో తేలింది. రైల్వే టికెట్లు కూడా బుక్ చేశాడు".. అని సీపీ రవిశంకర్ వెల్లడించారు.
మరోవైపు నిందితుడికి సంబంధించిన వాట్సాప్ సమాచారం కూడా సేకరించినట్లు వైజాగ్ సీపీ తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసేందుకు పది బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు . ప్రస్తుతానికి నిందితుడు వైజాగ్ దాటి వెళ్లాడన్న సీపీ.. ఎక్కడున్నా కూడా త్వరలోనే అరెస్ట్ చేసి తీరుతామని స్పష్టం చేశారు. విశాఖ రూరల్ పరిధిలో ఎమ్మార్వోగా పనిచేస్తున్న సనపాల రమణయ్య.. ఇటీవలే విజయనగరం జిల్లాలోని బొండపల్లికి ట్రాన్స్‌ఫర్ అయ్యారు. శుక్రవారం ఉదయమే బాధ్యతలు కూడా స్వీకరించారు. అయితే మధురవాడలోని కొమ్మాదిలో ఉంటున్న ఆయనను శుక్రవారం రాత్రి హత్య చేశారు. శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో అపార్ట్‌మెంట్ గేట్ వద్ద ఓ వ్యక్తి ఎమ్మార్వోపై ఇనుపరాడ్‌తో దాడి చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రగాయాలైన రమణయ్యను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయారు.
అయితే విశాఖలో జరిగిన ఈ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. విశాఖలో శాంతి భద్రతలు లోపించాయంటూ విపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. రెవెన్యూ ఉద్యోగుల సంఘం కూడా హత్యను తీవ్రంగా ఖండించింది. నల్లబ్యాడ్జీలకు విధులకు హాజరవ్వాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు.. 24 గంటలు గడవకముందే హత్యచేసిన నిందితుణ్ని గుర్తించారు. పరారైన నిందితుడి కోసం పది బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa