తిరుమలలో మంత్రి రోజాకు అమరావతి నిరసన సెగ తగిలిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారపై శ్రీవారి సేవకులు స్పందించారు. తమకు అవగాహన లేకపోవడంతో శ్రీవారి ఆలయం ముందు జై అమరావతి నినాదాలు చేశామని మహిహిళా శ్రీవారి సేవకులు అంటున్నారు. అమరావతి ప్రాంతానికి చెందిన తాము మంత్రి రోజాను చూడగానే ఎమోషనల్ అయ్యామని.. అందుకే జై అమరావతి నినాదాలు చేశామన్నారు. తామేము చేసిన దానికి మన్నించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
మంత్రి రోజాకు తిరుమలలో శుక్రవారం రోజు నిరసన సెగ తగిలింది. శ్రీవారి సేవ కోసం వచ్చిన కొంతమంది ఆమెను చుట్టుముట్టి జై అమరావతి నినాదాలు చేస్తూ.. మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారిని మంత్రి దర్శించుకున్నారు. అనంతరం ఆలయం బయట విలేకర్లతో మాట్లాడుతూ.. తాను మూడోసారి నగరి స్థానం నుంచే పోటీ చేయనున్నట్లు చెప్పారు. అదే సమయంలో కొందరు శ్రీవారి సేవకులు అక్కడికి వచ్చి జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. జై అమరావతి అనాలంటూ మంత్రిని కోరారు. ఇంతలో టీడీడీ భద్రతా సిబ్బంది శ్రీవారి సేవకులను హెచ్చరించి పంపేశారు. ఆ తర్వాత వారు క్లారిటీ ఇచ్చారు.. మన్నించాలని కోరారు.