వై నాట్ 175 నినాదంతో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దూసుకెళ్తున్నారు. వరుస బెట్టి జాబితాలు ప్రకటిస్తూ అభ్యర్థుల ఎంపికలో విపక్షాలతో పోలిస్తే చాలా ముందున్న జగన్.. సిద్ధం సభలతో ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఇప్పటికే భీమిలిలో సిద్ధం సభ నిర్వహించగా.. ఉత్తరాంధ్ర వాసుల నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. తాజాగా శనివారం ఏలూరు జిల్లా దెందులూరులో సిద్ధం సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి లక్షల మంది కార్యకర్తలు తరలివస్తున్నారు.
మరోవైపు సీఎం జగన్ సిద్ధం సభకోసం మాజీ మంత్రి పేర్నినాని బస్సు డ్రైవర్‌గా మారిపోయారు. ఈ సభ కోసం సుమారు 50 నియోజకవర్గాల నుంచి జససమీకరణ జరుగుతోంది. జసనమీకరణను వైసీపీ నేతలు, మంత్రులు, ముఖ్యనేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే మచిలీపట్నం ఎమ్మెల్యేగా ఉన్న పేర్నినాని బస్సుడ్రైవర్‌గా మారిపోయారు. జగన్ సిద్ధం సభకోసం బస్సులో కార్యకర్తలను వెంటబెట్టుకుని బయల్దేరి వెళ్లారు. మచిలీపట్నం నుంచి ఏలూరుకి బస్సులో కార్యకర్తలను తీసుకెళ్లారు పేర్నినాని. అయితే ఈ బస్సును స్వయంగా మాజీ మంత్రే డ్రైవింగ్ చేయడం విశేషం . కార్యకర్తల్లో ఉత్సాహం, జోష్ నింపేందుకు పేర్నినానినే స్వయంగా స్టీరింగ్ చేపట్టారు. ప్రస్తుతం పేర్నినాని బస్సులో కార్యకర్తలను తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక దెందులూరులో జరిగే సిద్ధం సభ విషయానికి వస్తే 110 ఎకరాల ప్రాంగణంలో సభకు ఏర్పాట్లు చేశారు. సభా వేదిక ముందు వైసీపీ గుర్తు అయిన ఫ్యాన్ ఆకారంలో వాకింగ్ వేను ఏర్పాటు చేశారు. ఈ సభ కోసం పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 3,298 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా 16వ నంబర్ జాతీయ రహదారిపై వాహనాలను దారిమళ్లించారు. అలాగే 50 నియోజకవర్గాల ఇంచార్జ్‌లకు కూడా రూట్ మ్యాప్ అందజేశారు. అలాగే సభ కోసం ఏడు ప్రాంతాల్లో 150 ఎకరాల పార్కింగ్ స్థలాలు కేటాయించారు. ఈ సభకు సుమారు ఐదు లక్షలమంది కార్యకర్తలు తరలివస్తారని వైసీపీ అంచనా.