ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఓ నిర్ణయం తీసుకుంటే వెనుకడుగు అంటూ వేయరు. బాగా ఆలోచించుకున్న తర్వాత సీఎం జగన్ ఏ స్టెప్ అయినా తీసుకుంటారు. కానీ ఓ విషయంలో మాత్రం సీఎం జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ కాస్త తగ్గిందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇక అసలు సంగతిలోకి వస్తే సిద్ధం సభలతో పార్టీలో కొత్త జోష్ తీసుకువస్తున్నారు సీఎం జగన్. తొలుత భీమిలిలో సిద్ధం సభను నిర్వహించిన వైసీపీ.. శనివారం ఏలూరు జిల్లా దెందులూరులో సిద్ధం సభను నిర్వహించింది. ఈ సభ కోసం ఉమ్మడి గోదావరి, కృష్ణా జిల్లాలో నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. సుమారు 50 నియోజకవర్గాల నుంచి జనసమీకరణ చేసినట్లు తెలుస్తోంది.
అయితే భీమిలి సభకు, దెందులూరు సిద్ధం సభకు పోలిక తెస్తున్నారు కొంతమంది నెటిజన్లు. రెండింటినీ పోలుస్తూ ఓ విషయంలో వైఎస్ఆర్సీపీ వెనక్కి తగ్గిందని అభిప్రాయపడుతున్నారు. భీమిలిలో నిర్వహించిన తొలి సిద్ధం సభకు భారీగా కార్యకర్తలు హాజరయ్యారు. తనను చూడ్డానికి వచ్చిన కార్యకర్తల దగ్గరకు వెళ్లి పలకరించేందుకు వీలుగా వైసీపీ శ్రేణులు ఓ ర్యాంప్ వాక్ ఏర్పాటు చేశాయి. ఈ ర్యాంప్ వాక్ మీదుగా కార్యకర్తల మధ్యలోకి వెళ్లిన జగన్.. వారికి అభివాదం చేస్తూ ప్రోత్సహించారు. అయితే భీమిలి సభ ముగిసిన తర్వాత దీని మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. మాజీ మంత్రి జవహర్ లాంటి కొంతమంది విపక్ష నేతలు సైతం ర్యాంప్ వాక్ విషయాన్ని ఆధారంగా చేసుకుని విమర్శలు చేశారు. శిలువ ఆకారంలో ఏర్పాటు చేసిన ర్యాంప్ వాక్ మీద జగన్ నడిచారని.. సీఎంకు పాపం చుట్టుకుంటుందని వ్యాఖ్యానించారు.
శిలువ ఆకారంలో ఏర్పాటు చేసిన ర్యాంప్ వాక్ మీద సీఎం జగన్ నడిచారని.. అది ఈ ఎన్నికల్లో వైసీపీకి శాపంగా మారుతుందని కేఎస్ జవహర్ విమర్శించారు. తన చర్యలతో సీఎం జగన్ క్రైస్తవ సమాజాన్ని అపహాస్యం చేశారని మండిపడ్డారు. ఏసు ప్రభువు పవిత్రమైన శిలువను మోస్తే.. అలాంటి శిలువ ఆకారం మీద జగన్ నడిచాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల విమర్శలతో పాటు సోషల్ మీడియాలోనూ దీనిపై కొంతమంది నెటిజన్లు విమర్శలు గుప్పించారు. అయితే విమర్శలను పరిగణనలోకి తీసుకున్నారో ఏమో తెలియదు కానీ.. దెందులూరు సభలో మాత్రం ర్యాంప్ వాక్‌ను మార్చేశారు.
దెందులూరు సభలో వైసీపీ గుర్తు అయిన ఫ్యాన్ ఆకారంలో ర్యాంప్ వాక్ ఏర్పాటు చేశారు. దీని మీదుగానే వెళ్లి సీఎం జగన్.. వైసీపీ కార్యకర్తలకు అభివాదం చేశారు. అలాగే సభ వేదికగా టీడీపీ, జనసేనలపై విమర్శలు గుప్పించారు. రామాయణం, మహాభారతంలో ఉన్న విలన్లు ఇప్పుడు చంద్రబాబు అండ్ కో రూపంలో ఉన్నారన్న జగన్.. వారి నుంచి అర్జునుడిలాంటి తనను ప్రజలే రక్షిస్తారని అన్నారు. తానెప్పుడూ ఒంటరిని కాదన్న జగన్.. విపక్షాల సైన్యం పొత్తులు అయితే.. తనకున్న తోడు, ధైర్యం ప్రజలు, దేవుడేనంటూ భావోద్వేగానికి గురయ్యారు. గుంపుగా వస్తున్న విపక్షాలతో పోరాటానికి తాను సిద్ధమని, కార్యకర్తలు కూడా సిద్ధమా అంటూ ఆవేశంగా ప్రసంగించారు.