ప్రశాంత్ కిషోర్ అంటే రాజకీయాలతో పరిచయం ఉన్నవారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎన్నికల వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా ఆయనకో పేరుంది. అందుకే ఆయన్ని ఏ రాజకీయ నేతను కలిసినా కూడా వెంటనే సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అదో పెద్ద వార్త అవుతుంది. ఈ నేపథ్యంలోనే గతేడాది డిసెంబర్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుణ్ని కలిశారు ప్రశాంత్ కిషోర్. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. పీకేను వెంటబెట్టుకుని మరీ చంద్రబాబు దగ్గరకు తీసుకెళ్లా్రు. ఆ తర్వాత ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వేదికగా చంద్రబాబు, ప్రశాంత్ కిషోర్ మధ్య కాసేపు చర్చలు జరిగాయి.
ఈ మీటింగ్ నేపథ్యంలో మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. ప్రశాంత్ కిషోర్ ఇక తెలుగుదేశానికి పనిచేయబోతున్నాడని, అందుకే చంద్రబాబును కలిశారంటూ వార్తలు వచ్చాయి. శాసనసభ ఎన్నికల సమయంలో ఏం చేయాలనే దానిపై ప్రశాంత్ కిషోర్ ఓ లిస్టు కూడా టీడీపీ అధినేతకు అందించాడనే ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమీ లేదని కాసేపటికే తేల్చేశారు ప్రశాంత్ కిషోర్. చంద్రబాబును కేవలం మర్యాద పూర్వకంగానే కలిశానంటూ వెళ్తూ వెళ్తూ మీడియాకు చెప్పివెళ్లారు. మరుసటి రోజు ఐప్యాక్ టీమ్ సైతం ఇదే విషయాన్ని వెల్లడించింది. వైఎస్ జగన్ తోనే తమ పయనమని స్పష్టం చేసింది.
అయితే ఈ విషయాలను పక్కనబెడితే చంద్రబాబు, పీకేలు కలవడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. 2019 ఎన్నికల సమయంలో వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించారు ప్రశాంత్ కిషోర్. ఆ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో జగన్ తరుఫున పనిచేసిన పీకేపై.. చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. బిహార్ డెకాయిట్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనంగా మారాయి. అలా ఇద్దరి మధ్య అంత వైరం ఉన్నప్పుడు చంద్రబాబు ఎలా ప్రశాంత్ కిషోర్‌ను సంప్రదించారనే విషయం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. చంద్రబాబుతో భేటీ తర్వాత ప్రశాంత్ కిషోర్ సైతం ఇదే విషయాన్ని వెల్లడించారు. టీడీపీకి పనిచేయాల్సిందిగా చంద్రబాబు తనను కోరారని, అయితే తాను ఇప్పుడు ఆ పని చేయడం లేదని టీడీపీ అధినేతకు తెలియజేసినట్లు పీకే వెల్లడించారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనను బిహార్ డెకాయిట్ అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ప్రశాంత్ కిషోర్ స్పందించారు. బిహార్ గజదొంగ, డేటా చోరీ చేశారంటూ చంద్రబాబు చేసిన విమర్శలపై రియాక్టయ్యారు. ఓ ఇంటర్వ్యూలో జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు పీకే. ఎన్నికల్లో ఓడిపోయామనే ఆవేశంతోనే చంద్రబాబు అలా మాట్లాడినట్లు ప్రశాంత్ కిషోర్ తెలిపారు. ఇటీవల ఆయనను కలిసిన సమయంలో చంద్రబాబు పట్ల తనకు వ్యక్తిగత ద్వేషం లేదనే విషయాన్ని వివరించినట్లు చెప్పుకొచ్చారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరుఫున పనిచేయాలని ఆయన కోరారని.. అయితే తాను తిరస్కరించినట్లు పీకే చెప్పారు. ప్రస్తుతం తాను ఆ పని వదిలేశానని చంద్రబాబుకు వివరించానని ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు.