తోడబుట్టిన సొంత చెల్లెలు వైఎస్ షర్మిలకే గౌరవం ఇవ్వలేని వాడు అర్జునుడు ఎలా అవుతాడు?’’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీఎం జగన్‌పై నిప్పులు చెరిగారు. చెల్లెలు షర్మిలను కొందరు నీచంగా తిడుతుంటే.. అన్న గా వారిని అడ్డుకోవాల్సింది పోయి, ఆయనే స్వయంగా ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి వ్యక్తి మన ఇంట్లో ఆడపడుచులకు గౌరవం ఇస్తాడా? అని ప్రశ్నించారు. ‘‘జగన్ బాధ వర్ణనాతీతం. ఆయన్ని అందరూ ఇబ్బంది పెట్టేస్తున్నట్టు, ఆయన ఒక అర్జునుడిలాగా.. మేమంతా కౌరవుల్లాగ మాట్లాడుతున్నారు. ప్రజలే గాండీవం.. ప్రజలే ఆయుధాలు. ప్రజలే శ్రీకృష్ణుడని మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉంది’’ అని పవన్ ఎద్దేవా చేశారు. ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ సమక్షంలో వైసీపీ మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఆయన తనయుడు పార్టీలో చేరారు. పవన్ మాట్లాడుతూ.. జనసేనలో చేరిన వల్లభనేని బాలశౌరిని, ఆయన తనయుడు అనుదీ్‌పను మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నామన్నారు. బాలశౌరి జనసేన తరఫున మరోసారి పార్లమెంట్‌లో అడుగు పెట్టాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌పై విరుచుకుపడ్డారు. వివేకానందరెడ్డి కుమార్తె సునీత తనకు రక్షణ లేదు, చంపేస్తామని ఫోన్లు వస్తున్నాయని చెబుతున్నారంటే జగన్ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.