ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రులు, అధికార పార్టీ సభ్యులు, ప్రతిపక్ష సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం బీఏసీ సమావేశం జరగనుంది. శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశమై బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనేదానిపై నిర్ణయించనుంది. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈనెల 7వ తేదీన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2024–25 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ, ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలలకు (ఏప్రిల్ నుంచి జూన్ వరకు) ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు అసెంబ్లీ ఆమోదం పొందనున్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ద్వారా ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉద్యోగుల జీతభత్యాలు, సామాజిక పింఛన్లు, కొనసాగుతున్న వివిధ పథకాలు, కార్యక్రమాలకు అవసరమైన నిధుల వ్యయానికి అసెంబ్లీ ఆమోదం తీసుకోనున్నారు.