ఏపీ అసెంబ్లీలో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం ముగిసింది. టీడీపీ సభ్యుల ఆందోళనల మధ్యే గవర్నర్ స్పీచ్ కొనసాగింది. ప్రభుత్వ సంక్షేమ పధకాలను గవర్నర్‌తో ప్రభుత్వం వల్లెవేయించింది. ఆంధ్రప్రదేశ్ టూరిజం ప్రాజెక్టులను గవర్నర్ ప్రస్తావించారు. చివరకు జాతిపత మహాత్మాగాంధీ మాటలతో గవర్నర్ తన ప్రసంగాన్ని ముగించారు. విజయవాడలో ప్రపంచంలో ఎత్తైన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరిగిందన్నారు. 18.8 ఎకరాల్లో 206 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని రూ.404.35 కోట్లతో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ విగ్రహం ఏర్పాటు పట్ల సీఎం జగన్, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. అల్పాదాయ వర్గాలకు ఆర్థిక లబ్ధి చేకూర్చే నవరత్నాలు కార్యక్రమం అమలు చేశామన్నారు. విద్యార్ధిని, విద్యార్థులకు బైజూస్ కంటెంట్‌తో టాబ్‌లు ఇచ్చామన్నారు. విద్యార్థులను గ్లోబల్ సిటిజన్స్‌గా మార్చే కృషి జరుగుతుందన్నారు. ఇంగ్లీష్ మీడియం వలన విద్యార్థులు అంతర్జాతీయంగా పోటీ పడే పరిస్థితి తెచ్చామని గవర్నర్ వెల్లడించారు.