ఏపీలో ఎండల తీవ్రత బాగా పెరిగింది. ఫిబ్రవరి నెల నుంచి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంచు, చలి ప్రభావం తగ్గిపోగా.. పగటిపూట ఎండలు మండిపోతున్నాయి. పసిఫిక్ మహా సముద్రంలో ఎల్‌నినో తీవ్ర దశకు చేరుకుంది. తూర్పు, మధ్య పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవడంతో శీతాకాలంలోనూ వేడి వాతావరణం కొనసాగుతోంది. ఈ ఏడాది వేసవిలో తొలుత మోస్తర్ వేడి, ఆ తర్వాత క్రమేపీ తీవ్రమైన ఎండలతో వడగాల్పులు వీస్తాయని అంచనా వేస్తున్నారు.గతేడాది కంటే మరింత తీవ్రమైన వేసవి చూడబోతున్నామంటున్నారు. గతేడాది దేశంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడంతో పాటు వడగాలులు వీచాయి. ఈ ఏడాది కూడా అంతకంటే దారుణమైన పరిస్థితులు ఉంటాయని అంచనా వేస్తున్నారు.
ప్రతి ఏటా ఫిబ్రవరి ఆఖరి వారంలో ఉష్ణోగ్రతలు మెల్లిగా పెరుగుతంటాయి.. కానీ ఈసారి తొలి వారం నుంచే పెరిగాయి. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాత్రి సయమంలో కూడా సాధారణం కంటే కాస్త ఎక్కువ ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి . రానున్న రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరగవచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కోస్తాతో పాటు రాయలసీమ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఆదివారం కర్నూలులో అత్యధికంగా 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.. కడపలో 34.8 . అనంతపురంలో 34.5, పల్నాడు జిల్లా జంగమేశ్వరపురంలో 34.6, నంద్యాల 34, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 33.6, గుంటూరు జిల్లా అమరావతిలో 33.2, తిరుపతిలో 33.2, నెల్లూరు జిల్లా కావలిలో 33, కాకినాడ జిల్లా తునిలో 32.4, నెల్లూరులో 32, మచిలీపట్నంలో 32 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. రాబోయే రోజుల్లో ఎండలు, వడగాలులకు కష్టాలు తప్పవంటున్నారు.