అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన యువకుడిపై దోపీడీ దొంగలు దాడికి తెగబడ్డారు. చికాగోలో ఇండియన్ వెస్లియన్ యూనివర్సిటీలో చదువుతున్న సయ్యద్ మజహిర్ అలీ దోపిడీ దొంగల దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. సయ్యద్ ఉంటోన్న అపార్ట్‌మెంట్ సమీపంలో ఫిబ్రవరి 4న ఈ ఘటన చోటుచేసుకుంది. లంగర్ హౌస్ ప్రాంతానికి చెందిన యువకుడు.. ప్రస్తుతం ఐటీలో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు. బాధితుడి భార్య ఫాతిమా రిజ్వీ వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 4న సయ్యద్ ఉండే అపార్టుమెంట్ సమీపంలో కొందరు అడ్డగించి దోపిడీకి పాల్పడ్డారు.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సయ్యద్‌ను వెంటనే స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. అతడి స్నేహితుడు ఫోన్ ద్వారా భారత్‌లోని కుటుంబసభ్యులకు సమాచారం అందజేశారు. తీవ్రంగా గాయపడిన తన భర్తకు ఫోన్ చేశానని, ఆయన కనీసం మాట్లాడలేని స్థితిలో ఉన్నాడని ఫాతిమా వాపోయారు. ఆయనకి తగిన వైద్య సహాయం అందించాలని కేంద్రం విదేశాంగ మంత్రి జైశంకర్‌కు మంగళవారం విజ్ఞప్తి చేసింది. ‘చికాగోలో ఉన్న నా భర్త భద్రత, ప్రాణాలు గురించి నేను చాలా ఆందోళన చెందుతున్నాను.. ఆయనకు ఉత్తమ వైద్యం అందించడంలో సహాయం చేయవలసిందిగా కోరుతున్నారు.. వీలైతే దయచేసి అవసరమైన ఏర్పాట్లు చేయమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను.. మీరు సహకరిస్తే నా భర్త ప్రాణాలు నిలబడతాయి.. తదర్వా నేను నా ముగ్గురు మైనర్ పిల్లలతో కలిసి ఆయన వద్దకు వెళ్లగలను’ అని ఆమె ప్రాధేయపడ్డారు.
ఇక, దాడికి పాల్పడిన దుండుగులు సెల్ఫోన్, డబ్బులను లాక్కొని పరారైన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. నలుగురు వ్యక్తులు అతడిపై దాడిచేసిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. ‘నేను ఇంటికి తిరిగొస్తుండగా నలుగురు వ్యక్తులు దాడి చేశారు.. దీంతో కిందపడిపోయిన నన్ను తీవ్రంగా కొట్టారు.. దయచేసి సాయం చేయండి’ అని బాధితుడు అలీ అర్ధించడం వీడియోలో వినిపిస్తోంది.
దీనిపై హైదరాబాద్ పోలీసులను ఆరా తీయగా తమకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. ఇటీవల కాలంలో ఇటువంటి ఘటనలు చోటుచేసుకోవడంతో విదేశీ చదువులంటేనే యువతలో ఏదో తెలియని ఆందోళన రేగుతోంది. తల్లిదండ్రులు సైతం భయాందోళనలకు గురవుతున్నారు. అమెరికాలో ఉన్నత విద్యకు వెళ్లిన భారతీయ విద్యార్థులు నెల రోజుల్లోనే నలుగురు అనుమానాస్పదరీతిలో మృతిచెందారు. ఈ ఘటనలు మరింత భయాందోళనకు గురిచేస్తున్నాయి. గతవారం తెలంగాణకు చెందిన శ్రేయాస్ రెడ్డి బెణిగర్ అనే 19 ఏళ్ల యువకుడు, నీల్ ఆచార్య అనే మరో భారతీయుడు విగతజీవులయ్యారు. జార్జియాలో వివేక్ సైనీ, అకుల్ ధావన్ అనే విద్యార్థులు హత్యకు గురయ్యారు.