అసెంబ్లీ ఎన్నికలకు టైమ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేగం పుంజుకున్నాయి. ఈ క్రమంలోనే పొత్తుల లెక్కలకు ఓ ముగింపు పలకాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీచేస్తామని ప్రకటించిన నేపథ్యంలో.. సీట్ల సర్దుబాటుపై పవన్ కళ్యాణ్, చంద్రబాబు మధ్య పలు దఫాలు చర్చలు జరిగాయి. ఇక ఈ కూటమిలోకి బీజేపీని కూడా చేర్చుకోవాలని భావిస్తున్నాయి రెండు పార్టీలు. ఈ క్రమంలోనే కమలం పార్టీ పెద్దల నుంచి చంద్రబాబుకు పిలుపు రావటం, ఆయన ఢిల్లీ వెళ్లడం వేగంగా జరిగిపోయాయి. ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు అమిత్ షాతో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు పొడుస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.
అయితే గతేడాది జులైలో అమిత్ షాతో చంద్రబాబు భేటీ అయ్యారు. 2018లో ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తర్వాత భేటీ కావటం అదే తొలిసారి. ఆ తర్వాత మరోసారి ఇద్దరి నేతల మధ్య ఎలాంటి భేటీ లేదు. అమిత్ షాతో భేటీ జరిగిన రోజే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కూడా చంద్రబాబు భేటీ అయ్యారు. అయితే సుమారు ఆరు నెలల తర్వాత ఇన్నిరోజులకు మళ్లీ బీజేపీ పెద్దల నుంచి పిలుపురావటంతో.. పొత్తు పొడవడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు బీజేపీ పెద్దలు సైతం రాష్ట్ర బీజేపీ నేతల అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాతనే చంద్రబాబుతో భేటీ అవుతున్నట్లు తెలిసింది.
ఇక రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరితే బీజేపీకి ఎన్నిసీట్లు ఇస్తారనే దానిపైనా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. 2014లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఉన్నాయి. అయితే అప్పటి ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ మాత్రమే పోటీచేశాయి. పవన్ కళ్యాణ్ కేవలం మద్దతు మాత్రమే తెలిపారు. జనసేన నాటి ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2014 ఎన్నికల్లో టీడీపీ 162 ఎమ్మె్ల్యే, 21 ఎంపీసీట్లలో పోటీ చేసింది. అటు బీజేపీ 13 ఎమ్మెల్యే, 4 ఎంపీ స్థానాలలో బరిలో నిలిచింది. అయితే ఇప్పుడు జనసేన కూడా కూటమి తరుఫున బరిలోకి దిగుతున్న నేపథ్యంలో బీజేపీకి అన్ని ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం కుదరక పోవచ్చనేది విశ్లేషకుల మాట. ఐదు నుంచి ఆరు అసెంబ్లీ స్థానాలు, మూడు లోక్ సభ స్థానాలను కేటాయించే ఆలోచనలో టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే బీజేపీ మాత్రం పదికి పైగా ఎమ్మెల్యే, 7 నుంచి 8 సీట్లు అడగాలని ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్యే సీట్ల విషయంలో కాస్త అటూ ఇటూ అయినా కూడా ఎంపీ సీట్లు మాత్రం గట్టిగా డిమాండ్ చేయాలనే యోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది.అరకు, విశాఖ, రాజమండ్రి, నరసపురం, ఒంగోలు, రాజంపేట, తిరుపతి ఎంపీ స్థానాలను బీజేపీ కోరుతున్నట్లు తెలిసింది.