ఎర్ర సముద్రంలో హుతీ తిరుగుబాటుదారులు దాడులు ఆగడం లేదు. అమెరికా, బ్రిటన్ సంయుక్తంగా భద్రత నిర్వహిస్తున్నా.. వెనక్కి తగ్గడం లేదు. మంగళవారం మరో రెండు డ్రోన్ దాడులకు పాల్పడ్డారు. అమెరికా, బ్రిటన్ వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకున్నారు. వీటిలో ఓ నౌక అమెరికా నుంచి భారత్‌కు వస్తోంది. ఇటీవల వరుస దాడులతో ప్రపంచ వాణిజ్యానికి తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇరాన్ మద్దతుగల హౌతీలు.. ఇజ్రాయేల్-హమాస్ యుద్ధంలో పాలస్తీనియన్లకు సంఘీభావంగా నౌకలపై దాడులకు తెగబడుతున్నారు.
హుతీ అధికార ప్రతినిధి యాహ్యా సారీ మాట్లాడుతూ.. ‘మంగళవారం జరిగిన మొదటి దాడి అమెరికా నౌక స్టార్ నాసియాను లక్ష్యంగా చేసుకోగా.. మరొకటి బ్రిటిష్ నౌక మార్నింగ్ టైడ్‌ను లక్ష్యంగా చేసుకుంది’ అని తెలిపారు. ‘హుతీలు ఆత్మరక్షణ కోసం శత్రువులైన అమెరికా-బ్రిటిష్ లక్ష్యాలపై మరిన్ని దాడులు తప్పవు’ సారీ గతంలో ట్విట్టర్లో హెచ్చరించారు. ప్రయివేట్ భద్రతా సంస్థ ఆంబ్రే.. యెమెన్‌లో బ్రిటన్ యాజమాన్యంలోని కార్గో నౌకపై డ్రోన్ దాడి జరిగినట్టు మొదట నివేదించింది. తర్వాత బార్బడోస్ జెండాతో కూడిన నౌకను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. నౌక సమీపంలో చిన్న పడవ నుంచి దాడులు జరిగింది. డ్రోన్ దాడి నౌకపై ప్రభావం చూపలేదని, సమీపంలో పేలిపోయిందని పేర్కొంది. దీనివల్ల ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని, స్వల్ప నష్టం జరిగిందని అంబ్రే చెప్పారు.
తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న ఓడరేవు నగరం హొడెయిడాలో జరిగిన సంఘటన గురించి నివేదిక అందిందని యునైటెడ్ కింగ్డమ్ మారీటైమ్ ట్రేడ్ర్ ఆపరేషన్స్ తెలిపింది. ‘ఓడరేవు వైపు నుంచి కాల్పులు జరిగాయి.. ఓ డ్రోన్ డెక్ మీదుగా వెళ్లిందని, కిటికీలకు స్వల్పంగా నష్టం వాటిల్లిందని మాస్టర్ తెలిపాడు.. ఓడ, సిబ్బంది సురక్షితంగా ఉన్నారు.. ముందస్తు ప్రణాళిక ప్రకారం నౌక ప్రయాణం కొనసాగుతోంది’ యూకేఎంటీఓ పేర్కొంది. గ్రీకు మర్చంట్ మెరైన్ మినిస్ట్రీ.. స్టార్ నాసియాకు స్వల్ప నష్టం వాటిల్లిందని, అయితే అందులోని ఫిలిపినో సిబ్బందికి ఎటువంటి గాయాలు కాలేదు వెల్లడించారు. చెప్పారు. మార్షల్ ఐలాండ్స్ జెండా ఉన్న గ్రీకు యాజమాన్యంలోని నౌక ఏడెన్‌కు నైరుతి దిశలో ప్రయాణిస్తున్నప్పుడు లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు. అమెరికా నుంచి భారత్‌కు వెళ్తోన్న నౌకకు 50 మీటర్ల దూరంలో పేలుడు సంభవించినట్లు నివేదించింది.