ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇమ్రాన్‌ఖాన్‌పై 150 కేసులు.. ఉరిశిక్ష తప్పదా!

international |  Suryaa Desk  | Published : Wed, Feb 07, 2024, 08:22 PM

పాక్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్-పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైలు జీవితం అనుభవిస్తున్నారు. వివిధ కేసుల్లో ఆయనకు కోర్టులు ఇప్పటికే 35 ఏళ్లకు పైగా శిక్షలు విధించాయి. మొత్తం 150 కి పైగా కేసులు ఇమ్రాన్‌ ఖాన్‌పై నమోదై ఉన్నాయి. ఇందులో చాలా తీవ్రమైన నేరాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఉరిశిక్ష పడే అవకాశాలు ఉన్నాయని పాకిస్థాన్ చట్టాలు చూస్తే అర్థం అవుతోంది. ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో ఇప్పటికే కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌లో ఎన్నికలు గురువారం జరగనున్నాయి. ఇక అక్కడ ఎన్నికల ముందు ఉగ్రవాద దాడులు, వేర్పాటు వాద ఉద్యమాలతో దాయాది దేశం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మరోవైపు.. ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్‌కు ఎన్నికలకు కొద్దిరోజుల ముందే బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ ఎన్నికల గుర్తును కూడా కోల్పోయింది. ఇక వివిధ కేసుల్లో కలిపి ఇప్పటికే ఇమ్రాన్‌ఖాన్‌కు 34 ఏళ్ల జైలు శిక్షను అక్కడి కోర్టులు విధించాయి.


ఇక ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్‌పై 150 కి పైగా కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యంత తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులు కూడా ఉన్నాయి. అందులో కొన్నింటిలో ఇమ్రాన్ ఖాన్ దోషిగా తేలితే ఉరిశిక్ష తప్పదని పాక్ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆ దేశంలో గత చరిత్ర చూసినా కూడా ఇదే విషయం స్పష్టం అవుతోంది. సైన్యానికి ఎదురుతిరిగిన ఏ నేతను కూడా పాకిస్థాన్ ఆర్మీ క్షమించలేదు. గతంలో పాక్ ప్రధానిగా పనిచేసిన జుల్ఫీకర్ అలీ భుట్టోను అక్కడి సైన్యం ఉరితీసింది. హుస్సేన్ షాషీద్ సుహ్రవర్దీ మిలిటరీ రూలర్ అయూబ్ ఖాన్‌కి ఎదురు తిరిగినందుకు ఆయనను అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ కూడా అదే పరిస్థితిలో ఉన్నారని పాక్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.


మరోవైపు.. గతేడాది మే నెలలో అల్ ఖదీర్ ట్రస్ట్ అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు, పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ కార్యకర్తలు దేశంలో విధ్వంసం సృష్టించారు. ప్రభుత్వ కార్యాలయాలు, రావల్పిండిలోని పాక్ ఆర్మీ స్థావరాలు, ప్రధాన కార్యాలయాలపై దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనల్లో ఇమ్రాన్ ఖాన్‌ సహా 100 మందిపై ఉగ్రవాద చట్టాల కింద కేసులు నమోదయ్యాయి. ఇది పాకిస్తాన్‌పై చేసిన యుద్ధంగా పరిగణించారు. పాక్ ఆర్మీ చట్టంలోని సెక్షన్ 59 ప్రకారం పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఆయుధాలు కలిగి ఉండి.. పాకిస్థాన్ సైన్యం లేదా భద్రతా బలగాలపై ఎవరైనా దాడి చేస్తే వారికి మరణశిక్ష విధించే అవకాశం ఉంది. ఈ కేసు విచారణ కూడా మిలిటరీ కోర్టులో జరుగుతోంది. అయితే ప్రస్తుతం మిలిటరీ కోర్టు తీర్పును ప్రకటించకుండా పాకిస్తాన్ సుప్రీంకోర్టు నిషేధం విధించింది. 2023 మే 9 న జరిగిన హింసలో ప్రధాన సూత్రధారిగా ఇమ్రాన్ ఖాన్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం దాడులు చేసేందుకు తన అనుచరులను ఇమ్రాన్ ఖాన్ ఉసిగొల్పారు. అయితే ఈ ఆరోపణలను ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా ఖండించారు. తనపై కుట్ర చేస్తున్నారని.. అప్పుడు లండన్‌లో ఉన్న మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ కలిసి తనను అంతం చేసేందుకు ప్రయత్నించాయని ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. నవాజ్ షరీఫ్‌ను తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు పాక్ సైన్యం డీల్ కుదుర్చుకుందని ఆరోపించారు.


ఇక ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పార్టీ గుర్తు అయిన క్రికెట్ బ్యాట్‌ను పాక్ ఎన్నికల సంఘం రద్దు చేసింది. ఇచ్చిన సమయంలో పార్టీలో అంతర్గత ఎన్నికలు నిర్వహించని కారణంగా పీటీఐ గుర్తును తొలగించినట్లు తెలిపింది. మరోవైపు.. పీటీఐ ప్రధాన కార్యాలయాన్ని కూడా పాక్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అయితే ఇమ్రాన్ ఖాన్ ఓటు వేయడానికి అనర్హుడి అని స్వయంగా తనకు తానే ప్రకటించుకున్నారు. అయితే మద్దతుదారులలో తనకు ఉన్న ఆదరణ అలాగే ఉందని.. తన పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు.. ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైలులో ఉండటం.. ఆయన పార్టీ పీటీఐ కూటమిగా పోటీ చేయకుండా నిషేధం విధించినందున.. నవాజ్ షరీఫ్ పార్టీ అయిన పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ అత్యధిక స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని పాక్ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో నవాజ్ షరీఫ్‌ నాలుగోసారి ప్రధానిగా పదవి దక్కే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com