మయన్మార్‌లోని రాఖైన్ రాష్ట్రంలో క్షీణిస్తున్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా అక్కడకు వెళ్లొద్దని భారత పౌరులకు కేంద్రం సూచించింది. అలాగే, ప్రస్తుతం అక్కడ ఎవరైనా భారతీయులు ఉంటే తక్షణమే బయలుదేరి రావాలని పేర్కొంది. రాఖైన్‌లో హింస చెలరేగుతోన్న నేపథ్యంలో తొలిసారి భారత్ సూచనలు చేసింది. టెలికమ్యూనికేషన్ వ్యవస్థ, నిత్యావసరాల కొరత సహా పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, భారతీయులకు అక్కడకు వెళ్లొద్దని విదేశాంగ శాఖ హెచ్చరించింది.
క్షీణిస్తున్న భద్రతా పరిస్థితి, ల్యాండ్‌లైన్‌లతో సహా టెలికమ్యూనికేషన్‌లకు అంతరాయం.. నిత్యావసర వస్తువుల తీవ్రమైన కొరత దృష్ట్యా, భారతీయ పౌరులందరూ మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రానికి వెళ్లవద్దని సూచించిస్తున్నాం.. ఇప్పటికే రాఖైన్‌లో ఉన్న భారతీయ పౌరులు వెంటనే ఆ రాష్ట్రం విడిచి వెళ్లాలి’ అని విదేశాంగ శాఖ తెలిపింది. మూడేళ్ల కిందట ఫిబ్రవరి 2021లో ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి సైన్యం అధికారం చేపట్టింది. అప్పటి నుంచి ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించాలని కోరుతూ ప్రజలు నిరసనలు, ఆందోళనలు కొనసాగిస్తున్నారు. గతేడాది అక్టోబరు నుంచి రాఖైన్ సహా పలు రాష్ట్రాల్లో ఆందోళనకారులు, సైన్యం మధ్య కొనసాగుతోన్న ఘర్షణలు హింసాత్మకంగా మారాయి.
పలు కీలకమైన పట్టణాలతో పాటు సరిహద్దుల్లోని భారత రాష్ట్రాలు మణిపూర్, మిజోరాంలకు సమీపంలో గత నవంబరు నుంచి రెండు పక్షాల మధ్య ఘర్షణలు మరింత తీవ్రతరమయ్యాయి. ఈ పరిణామాలపై భారత్ ఆందోళన చెందుతోంది. తన ప్రత్యర్థులు, పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని మయన్మార్ సైన్యం వైమానిక దాడులను చేపట్టింది. భారత్‌కు వ్యూహాత్మక పొరుగు దేశాల్లో ఒకటైన మయన్మార్.. నాగాలాండ్, మణిపూర్‌తో సహా అనేక ఈశాన్య రాష్ట్రాలతో 1,640 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటుంది. మయన్మార్‌లో హింసను పూర్తిగా నిలిపివేయాలని కోరిన భారత్.. సమ్మిళిత సమాఖ్య ప్రజాస్వామ్యం పరివర్తనకు పిలుపునిచ్చింది. ఇటీవల విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. వ్యూహాత్మక పొరుగుదేశం మయన్మార్‌లో పరిస్థితి క్షీణించడంపై మేము ఆందోళన చెందుతున్నామని అన్నారు.