ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ఎడిషన్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా రిషభ్ పంత్ అధికారికంగా నియమితుడయ్యాడు. ఈ మేరకు మెగా వేలంలో రూ.27 కోట్లకు దక్కించుకున్న రిషభ్ పంత్‌ను కెప్టెన్‌గా నియమించినట్లు లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంగా వెల్లడించారు. కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు. ఈ కార్యక్రమంలో రిషభ్ పంత్ కూడా పాల్గొన్నాడు. గతంలో ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు గతంలో కెప్టెన్‌గా వ్యవహరించిన పంత్.. 18వ సీజన్ పోటీకి ముందు వేలంలోకి వచ్చాడు. ఈ వేలంలో అతడిని దక్కించుకునేందుకు ఫ్రాంఛైజీలు పోటీ పడ్డాయి. రూ.2 కోట్ల కనీస ధరతో పంత్ వేలంలోకి వచ్చాడు. అతడిని దక్కించుకునేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ పోటీ పడ్డాయి. చివరకు లక్నో.. రూ.20.75 కోట్లకు బిడ్డింగ్ చేసింది.
ఆర్టీఎం కార్డు ఉపయోగిస్తామని ఢిల్లీ క్యాపిటల్స్ చెప్పడంతో.. ఏకంగా పంత్ ధరను రూ.27 కోట్లకు పెంచింది లక్నో. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ డ్రాప్ అయింది. పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకుంది. వాస్తవానికి ఢిల్లీ క్యాపిటల్స్ సారథిగా బాధ్యతలు నిర్వర్తించిన అతడికి కెప్టెన్సీని అప్పగించేందుకే లక్నో అంత మొత్తం పెట్టిందని వార్తలొచ్చాయి. కానీ ఆ తర్వాత నికోలస్ పూరన్ కూడా కెప్టెన్సీ రేసులో ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ చివరికి లక్నో యాజమాన్యం పంత్ వైపే మొగ్గు చూపింది.
కోల్‌కతా నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ సంజీవ్ గోయెంకా కీలక వ్యాఖ్యలు చేశారు. “రిషభ్ పంత్‌లో పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. అతడు ఐపీఎల్‌లో అత్యంత విలువైన ఆటగాడు మాత్రమే కాదు అత్యుత్తమ ఆటగాడు కూడా. ప్రస్తుతం ఐపీఎల్‌లో మహేంద్రసింగ్ ధోనీ, రోహిత్ శర్మలను విజయవంతమైన కెప్టెన్లుగా చెబుతుంటారు. కానీ నా మాటలు గుర్తుంచుకోండి. 10-12 ఏళ్ల తర్వాత కచ్చితంగా పంత్ కూడా వారి సరసన చేరుతాడు” అని సంజీవ్ గొయెంకా వ్యాఖ్యానించారు.
కాగా ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 21న ప్రారంభం కానుంది. ఫైనల్ మ్యాచ్ మే 25న ఫైనల్ జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ సొంతమైదానమైన కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో టోర్నీ తొలి, ఫైనల్ మ్యాచులను నిర్వహిస్తారు. ఇక గతేడాది రన్నరప్‌గా నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతమైదానంలో ఉప్పల్ స్టేడియంలో క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఐపీఎల్ 2024 మాదిరిగానే.. ఈ సారి కూడా మొత్తం 74 మ్యాచ్‌లు జరుగుతాయి.