అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధం అయింది. 2016లో తొలిసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్.. ఆ తర్వాత 2020లోనూ పోటీ పడ్డారు. అయితే ఆ ఎన్నికల్లో జో బైడెన్ చేతుల్లో ఓటమి పాలైన ట్రంప్.. ఆ తర్వాత అనేక ఇబ్బందులు, సుడిగుండాల్లో చిక్కుకున్నారు. వాటన్నింటినీ అధిగమించి.. రిపబ్లికన్ పార్టీలోనే వ్యతిరేకత, విమర్శలు ఉన్నా వాటిని దాటేసి కొన్ని నెలల క్రితం జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఇప్పుడు మరోసారి అమెరికా అధ్యక్ష కుర్చీలో కూర్చునేందుకు సిద్ధం అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన పోర్న్ స్టార్‌కు డబ్బులు చెల్లించిన హష్ మనీ కేసులో దోషిగా తేలడం సంచలనంగా మారింది. ఈ కేసులో దోషిగా తేలినా.. డొనాల్డ్ ట్రంప్ శిక్షను అనుభవించాల్సిన అవసరం లేదని న్యూయార్క్ కోర్టు తేల్చి చెప్పింది. అయితే దోషిగా తేలిన వ్యక్తి అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఈ క్రమంలోనే 78 ఏళ్ల వయసులో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్న ట్రంప్.. అమెరికా చరిత్రలోనే అత్యంత పెద్ద వయసు కలిగిన వ్యక్తిగా నిలిచారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చున్న తర్వాత అమెరికాపై ట్రంప్ మార్క్ ఏవిధంగా ఉండబోతుంది అనే విషయం ప్రపంచ దేశాలు తీవ్ర ఆసక్తిగా మారింది. మొదటిసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసినప్పటి నుంచి.. మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ పడే నాటికి ట్రంప్ జీవితంలో ఎన్నో కీలక పరిణామాలు జరిగాయి. 2020 అమెరికా ఎన్నికల ఫలితాల్లో ఓటమిని అంగీకరించని ట్రంప్, ఆయన మద్దతుదారులు యూఎస్ క్యాపిటల్ హిల్ భవనాన్ని ముట్టడించడం.. అమెరికా చరిత్రలో ఎన్నడూ జరగని ఘటనగా మిగిలిపోయింది.
ఈ దాడిలో డొనాల్డ్ ట్రంప్‌తోపాటు వందలాది మంది ఆయన మద్దతుదారులపై కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు.. హష్ మనీకి సంబంధించి క్రిమినల్ కేసులు, న్యాయ విచారణ, చివరికి దోషిగా తేలినా.. ట్రంప్ మద్దతుదారులు మాత్రం అతని వెంటనే ఉన్నారు. ఇక ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల ప్రచారంలో భాగంగా పెన్సిల్వేనియాలో డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం ఘటన ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఆ తర్వాత అనూహ్యంగా ట్రంప్‌కు మద్దతు పెరిగిపోయింది.
మరోవైపు.. తాను అధికారంలోకి వస్తే అమెరికాను మళ్లీ ప్రపంచంలోనే గొప్ప దేశంగా మారుస్తానని పేర్కొన్నారు. మెక్సికో సరిహద్దులో కంచె నిర్మాణం పూర్తిచేసి అమెరికాలోకి అక్రమ వలసలను అరికడతానని ప్రచారంలో తెలిపారు. మూడో ప్రపంచ యుద్ధం రాకుండా ఆపేస్తానని హామీ ఇచ్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కూడా ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో కెనడాను విలీనం చేసి.. 51వ రాష్ట్రంగా చేయడం.. గ్రీన్‌ల్యాండ్, పనామాలను స్వాధీనం చేసుకుంటామని ప్రకటించడం.. గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చడం వంటి సంచలన ప్రకటనలకు తెరతీశారు. అంతేకాకుండా అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే కీలక ఆదేశాలపై సంతకాలు చేస్తానని కూడా ప్రకటించారు. గతంలో చైనా వంటి దేశాలతో దూకుడుగా వ్యవహరించిన ట్రంప్.. ఇప్పుడు ప్రపంచ శాంతికి కలిసి పనిచేద్దామని పేర్కొన్నారు.