మహమ్మద్ ప్రవక్తను అవమానించిన కేసులో పాప్ సింగర్ ఆమిర్ హుస్సేన్ మగ్‌సౌద్లూకు ఇరాన్ కోర్టు మరణ శిక్ష విధించింది. గతంలో ఇదే కేసులో 5 సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించిన ఇతడి కేసును తాజాగా రీఓపెన్ చేశారు. ఈక్రమంలోనే అతడికి మరణ శిక్ష విధించారు. అయితే ఈ కేసు మాత్రమే కాకుండా ఇతడిపై దేశ ద్రోహానికి సంబంధించిన ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాగే ఈ తీర్పును అప్పీల్ చేసుకునే అవకాశాన్ని కూడా న్యాయస్థానం అతడికి కల్పించింది. ఆ పూర్తి వివరాలపై ఓ లుక్కేద్దాం.
ఇరాన్‌కు చెందిన 37 ఏళ్ల ఆమిర్ హుస్సేన్ మగ్‌సౌద్లూకు.. పాప్ సింగర్‌గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా శరీరం అంతటా టాటూలు వేయించుకున్న ఇతడిని టట్లూగా కూడా పిలుస్తుంటారు చాలా మంది. 2016లో ఆమిర్ హుస్సేన్ అనేక సార్లు అరెస్ట్ అయ్యాడు. ఈక్రమంలోనే రెండేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు. జైలు నుంచి విడుదల అయ్యాక అంటే 2018లో ఇతడు టర్కీకి వెళ్లాడు. అక్కడే అనేక ఆల్బమ్స్ రూపొందించాలని ప్రయత్నించాడు. అలాగే పెద్ద పెద్ద కచేరీలలో కూడా ప్రదర్శన ఇచ్చాడు. ఇప్పటి వరకు ఆమిర్ హుస్సేన్ 21 ఆల్బమ్‌లను విడుదల చేయగా.. 2021లో చివరి ఆల్బమ్ విడుదల అయింది.
అయితే అదే ఏడాది 16 ఏళ్ల వయుసలో ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకోవడానికి అనుమతించాలని కామెంట్లు చేస్తూ పెద్ద ఎత్తున కలకలం సృష్టించాడు ఆమిర్ హుస్సేన్. ఆ తర్వాత రెండేళ్లకు అంటే 2023లో పాస్‌పోర్ట్ గడువు ముగియడంతో.. ఇస్తాంబుల్ వెళ్లాలనుకున్న అతడిని అడ్డుకుని ఇరాన్‌కు అప్పగించారు టర్కీ పోలీసులు. అప్పటి నుంచి అతను ఇరాన్ కస్టడీలోనే ఉంటున్నాడు. ముఖ్యంగా వ్యభిచారాన్ని ప్రోత్సహించిన కేసులో ఈ పాప్ సింగర్‌కు పదేళ్ల జైలు శిక్ష పడింది. అలాగే మరో కేసులో ఇస్లామ్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేసినందుకు కూడా శిక్ష వేశారు.
తాజాగా మహమ్మద్ ప్రవక్తను అవమానించిన కేసులో ఇరాన్ కోర్టు.. ఇతడికి మరణ శిక్ష విధించింది. అయితే 2023లో ఇరాన్‌లో 900 మందికి పైగా మరణ శిక్షలు అమలు అయ్యాయి. గత తొమ్మిది సంవత్సరాలలో ఆ ఏడాదే ఎక్కువ మంది ఉరి తీయబడ్డారు. అలాగే 2023లో అమలు చేసిన ఉరి శిక్షల సంఖ్యతో పోలిస్తే ఈ రెండేళ్లలో ఆ సంఖ్య 6 శాతానికి పైగా పెరిగింది. ఇదంతా చూస్తుంటే పాప్ సింగర్ ఆమిర్ హుస్సేన్‌కు కూడా త్వరలోనే మరణ శిక్ష అమలు అయ్యే అవకాశం కనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.